
వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి నిధి ఖరే వెల్లడి
రోజువారీ జీవనంలో కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని నైతికంగా ఉపయోగించడానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలను రూపొందించడంపై కసరత్తు జరుగుతోందని వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. ఆయా కమిటీల్లో భారతీయ నిపుణులు కూడా ఉన్నారని వివరించారు.
గ్లోబల్ ప్రమాణాలు ఖరారైన తర్వాత భారత్ సహా ప్రపంచ దేశాలు వాటిని అమలు చేస్తాయని పీహెచ్‌డీసీసీఐ సదస్సులో చెప్పారు. ఇప్పటికే 39 ఉండగా, మరో 45 గ్లోబల్ ఏఐ ప్రమాణాలను రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఏఐ టెక్నాలజీకి రెండు పార్శ్వాలు ఉన్నాయని చెప్పారు. రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో మోసాలను అరికట్టేందుకు ఇది ఉపయోగపడనుండగా, అదే సమయంలో అనైతికంగా ఉపయోగిస్తే ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలూ ఉన్నాయని నిధి చెప్పారు.
‘ప్రస్తుతం ప్రపంచంలో ఏఐ పెద్ద సవాలుగా మారింది. దీనితో ఎంతగా దుష్ప్రచారం జరుగుతోందో మనం చూస్తున్నాం. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు ప్రభుత్వాలు తప్పనిసరిగా చట్టాలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. అలాగని ఏఐ వల్ల ప్రయోజనాలు లేవని చెప్పడానికి లేదు. సోషల్ మీడియా, ప్లాట్‌ఫాంలు, నవకల్పనలకు సంబంధించి ఇదొక సానుకూల, సృజనాత్మక ఆవిష్కరణ’ అని తెలిపారు.
ఇదీ చదవండి: పండుగ సీజన్‌పై ‘సోనీ’ ఆశలు..!