గ్రామాల్లో ‘నయాగాడీ’

New startup diary naya gaadi - Sakshi

వాహనాల డీలర్‌షిప్‌కు ప్రత్యామ్నాయం

బైక్, కారు, ఆటో, ట్రాక్టర్‌ ఏదైనా కొనే వీలు

వాహన రుణం, బీమా, నిర్వహణ సేవలు కూడా

రూ.5 కోట్ల నిధుల సమీకరణ...

‘స్టార్టప్‌ డైరీ’తో నయాగాడీ ఫౌండర్‌ బాలాజీ  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టూవీలరైతే ఓకే!! కానీ ట్రాక్టర్ల వంటి భారీ వాహనాల షోరూమ్‌లు ప్రతి గ్రామంలోనూ ఉండాలంటే కష్టమే. స్థలం... పెట్టుబడి... మార్జిన్లు... ఇలాంటివన్నీ దీనిపై ప్రభావం చూపిస్తాయి. ఇదిగో... ఇలాంటి సమస్యలకు చిత్తూరు జిల్లా నగరి కుర్రాడు బాలాజీ చూపించిన పరిష్కారమే... ‘నయాగాడీ’!

కైశెట్టి బాలాజీది రైతు కుటుంబం. వ్యవసాయం కోసం ట్రాక్టర్‌ కొందామనుకున్నాడు. అడ్వాన్సు పట్టుకుని బయలుదేరాడు. అప్పుడు తెలిసింది.. వాళ్ల ఊళ్లో ట్రాక్టర్‌ షోరూమ్‌ లేదని! చిత్తూరుకు వెళ్లి కొనాలి. కంపెనీ రేటొకటైతే స్థానిక డీలర్‌ చెప్పేది మరొకటి!!. అవసరం మనది కనక చేసేదేమీ ఉండదు. డీలర్లే కాదు! వాహన రుణాలిచ్చే బ్యాంక్‌లు, బీమా కంపెనీలు, నిర్వహణ కేంద్రాలు అన్నింటికీ సమస్యే. దీనికి టెక్నాలజీతో బాలాజీ చెప్పిన సమాధానమే ‘‘నయాగాడీ’’ ఆవిష్కరించింది. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

చిత్తూరులో డిప్లొమా పూర్తయ్యాక.. బెంగళూరులోని ఆటోమొబైల్‌ డిజైన్, సప్లయి కంపెనీ ఆస్పెక్ట్‌లో చేరా. అక్కడి నుంచి విప్రో, హెచ్‌పీ, ఐబీఎం వంటి కంపెనీల్లోనూ పనిచేశా. బహుళ జాతి ఆటో మొబైల్‌ కంపెనీల్లో 10 ఏళ్ల అనుభవం ఉంది. దీంతో 2015 సెప్టెంబర్‌లో రూ.25 లక్షల పెట్టుబడితో బెంగళూర్లో ‘నయాగాడీ.కామ్‌’ను ప్రారంభించా. స్థానికంగా ఉండే అన్ని రకాల వాహన డీలర్లతో ఒప్పందం చేసుకొని గ్రామాల్లో నయాగాడీ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలు, ఏజెంట్లను ఏర్పాటు చేసి వాహనాలను విక్రయించడమే మా ప్రత్యేకత.

రూ.4 కోట్లు; 80 వాహనాలు..
నయాగాడీలో బైక్‌లు, ఆటోలు, కార్లు, జీపులు, ట్రాక్టర్ల వంటి అన్ని రకాల వాహనాలతో పాటూ ఎలక్ట్రిక్‌ వాహనాలనూ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం బెంగళూరు, ఒడిశా నగరాల్లో సేవలందిస్తున్నాం. 120 మంది వాహన డీలర్లతో ఒప్పందం చేసుకున్నాం. రుణాల కోసం క్యాపిటల్‌ ఫస్ట్, కొటక్, బీమా కోసం పాలసీబజార్, రెన్యూ, గోడిజిట్‌ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. నయాగాడీ మల్టీ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లలో వాహనాలకు సంబంధించిన బ్రోచర్లు, ఫొటోలు, ధరలు, రుణం, బీమా వంటి అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు నయాగాడీ వేదికగా రూ.4 కోట్ల విలువ చేసే 80 వాహనాలను విక్రయించాం. డీలర్‌ ధర కంటే నయాగాడీలో రూ.1,000–10,000 వరకు ధర తక్కువే ఉంటుంది. పైగా విడిభాగాలు, ఇతరత్రా ఉపకరణాలపై 20% కమీషన్‌ కూడా ఉంటుంది.

నెల రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి...
నెల రోజుల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖ, గుంటూరుల్లో నయాగాడీ కేంద్రాలను ప్రారంభించనున్నాం. ఆయా ప్రాంతాల్లో 100 మంది డీలర్లతో డీల్‌ చేసుకున్నాం. ఏడాదిలో చెన్నై, కోచి, భువనేశ్వర్, కటక్‌ ప్రాంతాల్లో నయాగాడీ సెంటర్లను ప్రారంభిస్తాం. ఏడాదిన్నరలో దేశంలోని 30 ప్రాంతాలకు విస్తరించాలన్నది మా లక్ష్యం.

రూ. 3 కోట్ల ఆర్డర్‌ బుక్‌..
ప్రతి వాహనం విక్రయంపై డీలర్‌ నుంచి 1 శాతం, బ్యాంక్‌ రుణం పొందితే బ్యాంక్‌ నుంచి 1–1.50 శాతం, బీమా కంపెనీ నుంచి 10–20 శాతం వరకు కమీషన్‌ వస్తుంది. ప్రస్తుతం రూ.3 కోట్ల ఆర్డర్‌ బుక్‌ చేతిలో ఉంది. 3 నెలల్లో టీవీఎస్, నిస్సాన్, రెనాల్ట్, మహీంద్రా వాహన సంస్థలతో ఒప్పందాలు పూర్తవుతాయి. దీంతో డీలర్లతో పాటూ నేరుగా నయాగాడీలోనూ విక్రయాలుంటాయి.

రూ.5 కోట్ల నిధుల సమీకరణ..
గతేడాది కర్నాటక ప్రభుత్వ ఎలైట్‌ 100 పోటీలో విజేతగా నిలిచాం. దీంతో రూ.10 లక్షలు గ్రాంట్‌గా లభించింది. ప్రస్తుతం మా కంపెనీలో 11 మంది ఉద్యోగులున్నారు. త్వరలో ఈ సంఖ్యను 25కి చేర్చనున్నాం. గతేడాది రూ.2.5 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. వచ్చే ఏడాది కాలంలో రూ.50 కోట్ల టర్నోవర్‌ను చేరుకోవాలి లకి‡్ష్యంచాం. పలువురు హెచ్‌ఎన్‌ఐలు, ఏంజిల్‌ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top