మిస్త్రీకి టాటా చెల్లదు!

NCLAT restores Cyrus Mistry as executive chairman of Tata Group - Sakshi

టాటా గ్రూప్‌ పగ్గాలు సైరస్‌ మిస్త్రీకే...

చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ నియామకం చట్టవిరుద్ధం

కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు

ప్రైవేట్‌ సంస్థగా మార్పునకూ తిరస్కరణ

టాటా గ్రూప్‌ అప్పీలుకు 4 వారాలు చాన్స్‌  

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి నాటకీయ ఫక్కీలో ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీకి ఎట్టకేలకు ఊరట లభించింది. మళ్లీ ఆయన్ను ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించాలని, గ్రూప్‌ సంస్థల బోర్డుల్లో డైరెక్టరుగా కొనసాగించాలని నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. టాటా సన్స్‌ చైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్‌ నియామకం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అలాగే, టాటా సన్స్‌ స్వరూపాన్ని పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి ప్రైవేట్‌ కంపెనీగా మార్చడం కూడా చెల్లదని ఎన్‌సీఎల్‌ఏటీ స్పష్టం చేసింది. వీటికి సంబంధించి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. ఈ ఆదేశాలు నాలుగు వారాల్లో అమల్లోకి వస్తాయి. ఈ లోగా దీనిపై టాటా గ్రూప్‌ అప్పీలు చేసుకోవచ్చని ఎన్‌ఎస్‌ఎల్‌ఏటీ తెలిపింది.

‘2016 అక్టోబర్‌ 24న టాటా సన్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశంలో మిస్త్రీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధం. కాబట్టి మళ్లీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టవచ్చు. అలాగే, టాటా కంపెనీల్లో డైరెక్టరుగా కూడా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో మిస్త్రీ స్థానంలో చంద్రశేఖరన్‌ నియామకం చట్టవిరుద్ధం అవుతుంది’ అని జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ్‌ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్‌ తుది ఉత్తర్వులిచ్చింది. మరోవైపు, డైరెక్టర్ల బోర్డు లేదా వార్షిక సర్వసభ్య సమావేశంలో మెజారిటీ అనుమతులు అవసరమయ్యే ఏ నిర్ణయాలను ముందస్తుగా తీసుకోకూడదంటూ టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటాను, టాటా ట్రస్ట్స్‌ నామినీని ఆదేశించింది.

మిస్త్రీకి వ్యతిరేకంగా ఆర్టికల్‌ 75లోని నిబంధనలు ప్రయోగించరాదంటూ డైరెక్టర్ల బోర్డుకు, షేర్‌హోల్డర్లకు సూచించింది. అటు, టాటా సన్స్‌ స్వరూపాన్ని పబ్లిక్‌ కంపెనీ నుంచి ప్రైవేట్‌ కిందకు మార్చాలన్న కంపెనీల రిజిస్ట్రార్‌ (ఆర్‌వోసీ) నిర్ణయాన్ని అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. దీన్ని రికార్డుల్లో సత్వరం సరిచేయాలంటూ ఆర్‌వోసీని ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశించింది. ఇక, మిస్త్రీకి వ్యతిరేకంగా 2018 జూలై 9న ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా తప్పుబట్టింది. ఇవి మిస్త్రీ ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయని, వీటిని రికార్డుల నుంచి తొలగించాలని పేర్కొంది. అయితే, మిస్త్రీని డైరెక్టరుగా కొనసాగించడం మినహా... ఆయన్ను చైర్మన్‌గా పునర్నియమించాలన్న ఆదేశాలను సస్పెన్షన్‌లో ఉంచాలని టాటా సన్స్‌ న్యాయవాది ఎన్‌సీఎల్‌ఏటీని అభ్యర్థించారు.

చట్టపరంగా చర్యలు: టాటా సన్స్‌
ట్రిబ్యునల్‌ ఆదేశాలు చూస్తుంటే అడిగిన దానికి మించే మిస్త్రీకి ఊరటనిచ్చినట్లు కనిపిస్తోందని టాటా సన్స్‌ వ్యాఖ్యానించింది. టాటా సన్స్, ఇతర లిస్టెడ్‌ టాటా కంపెనీల షేర్‌హోల్డర్లు.. చట్టబద్ధంగా షేర్‌హోల్డర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎన్‌సీఎల్‌ఏటీ ఏ విధంగా తిరస్కరిస్తుందన్న దానిపై స్పష్టత లేదని పేర్కొంది. ‘మా కేసు బలంగా ఉందని గట్టిగా విశ్వసిస్తున్నాం. తాజా ఆదేశాలకు సంబంధించి చట్టపరంగా ముందుకు వెడతాం‘ అని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, తాజా పరిణామాలతో చంద్రశేఖరన్‌ టాటా గ్రూప్‌ ఉద్యోగులకు లేఖ రాశారు. లీగల్‌ అంశాలను సంస్థ చూసుకుంటుందని.. సిబ్బంది తమ కార్యకలాపాలపై దృష్టిపెట్టి, వాటాదారుల ప్రయోజనాలను కాపాడాలని పేర్కొన్నారు.

గ్రూప్‌ కంపెనీల షేర్లు పతనం..
అపీలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల నేపథ్యంలో.. టాటా గ్రూప్‌ కంపెనీల షేర్లు 4 శాతం దాకా క్షీణించాయి. బీఎస్‌ఈలో టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ 4 శాతం, టాటా కాఫీ 3.88 శాతం, టాటా మోటార్స్‌ 3.05 శాతం పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాటా మోటార్స్‌ షేరు అత్యధికంగా క్షీణించింది. అటు ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ 2.48 శాతం, టాటా కెమికల్స్‌ 1.65 శాతం, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ 1.22 శాతం, టాటా పవర్‌ కంపెనీ 0.98 శాతం తగ్గాయి.

మూడేళ్ల పోరాటం..
► 2016 అక్టోబర్‌ 24: టాటా సన్స్‌ చైర్మన్‌గా మిస్త్రీ తొలగింపు. తాత్కాలిక చైర్మన్‌గా రతన్‌ టాటా నియామకం.
► 2016 డిసెంబర్‌ 20: మిస్త్రీ తొలగింపును సవాల్‌ చేయడంతో పాటు టాటా సన్స్‌లో అవకతవకలు, మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కులు కాలరాస్తున్నారని ఆరోపిస్తూ మిస్త్రీ కుటుంబానికి చెందిన  సంస్థలు ఎన్‌సీఎల్‌టీని (ముంబై) ఆశ్రయించాయి.

► 2017 జనవరి 12: అప్పటి టీసీఎస్‌ సీఈవో, ఎండీ ఎన్‌ చంద్రశేఖరన్‌ను చైర్మన్‌గా నియమిస్తున్నట్లు టాటా సన్స్‌ ప్రకటించింది.
► 2017 ఫిబ్రవరి 6: టాటా గ్రూప్‌ సంస్థల హోల్డింగ్‌ సంస్థ అయిన టాటా సన్స్‌ బోర్డు నుంచి డైరెక్టరుగా మిస్త్రీ తొలగింపు.
► 2017 మార్చి 6: మిస్త్రీ కంపెనీల పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ కొట్టేసింది. మైనారిటీ షేర్‌హోల్డర్ల తరఫున పిటిషన్‌ వేయాలంటే 10 శాతం వాటాలైనా ఉండాలన్న నిబంధనకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొంది. మిస్త్రీ కుటుంబానికి టాటా సన్స్‌లో 18.4 శాతం వాటాలు ఉన్నప్పటికీ.. ప్రిఫరెన్షియల్‌ షేర్లను పక్కన పెడితే కేవలం 3% వాటా మాత్రమే ఉండటం ఇందుకు కారణం. ఆ తర్వాత 10% వాటాల నిబంధన నుంచి మినహాయింపునివ్వాలంటూ మిస్త్రీ సంస్థలు చేసిన విజ్ఞప్తిని కూడా ఏప్రిల్‌ 17న ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది.

► 2017 ఏప్రిల్‌ 27: ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలపై మిస్త్రీ సంస్థలు ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించాయి.  
► 2017 సెప్టెంబర్‌ 21: 10 శాతం వాటాల నిబంధన మినహాయింపు విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఎన్‌సీఎల్‌ఏటీ.. మిగతా ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఎన్‌సీఎల్‌టీని సూచించింది.  
► 2017 అక్టోబర్‌ 5: కేసును ముంబై నుంచి ఢిల్లీకి మార్చాలంటూ ఎన్‌సీఎల్‌టీ ప్రిన్సిపల్‌ బెంచ్‌ను మిస్త్రీ సంస్థలు కోరాయి. అయితే, దీన్ని తిరస్కరించిన ప్రిన్సిపల్‌ బెంచ్‌.. రెండు సంస్థలకు కలిపి రూ. 10 లక్షల జరిమానా విధించింది.
► 2018 జూలై 9: టాటా గ్రూప్, రతన్‌ టాటాపై మిస్త్రీ ఆరోపణల్లో పసలేదని పిటిషన్‌లను కొట్టేసిన ఎన్‌సీఎల్‌టీ (ముంబై)
► 2018 ఆగస్టు 3: ఎన్‌సీఎల్‌టీ తీర్పును సవాల్‌ చేస్తూ మిస్త్రీ సంస్థలు అపీలేట్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఆగస్టు 29న మిస్త్రీ వ్యక్తిగత పిటిషన్‌ను కూడా స్వీకరించిన ఎన్‌సీఎల్‌ఏటీ.. మిగతా పిటిషన్లతో కలిపి విచారణ చేయాలని నిర్ణయించింది.
► 2019 మే 23: వాదనలు ముగిసిన అనంతరం ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు రిజర్వ్‌లో ఉంచింది.
► 2019 డిసెంబర్‌ 18: మిస్త్రీని టాటా సన్స్‌ చైర్మన్‌గా మళ్లీ నియమించాలంటూ ఆదేశాలిచ్చింది. అప్పీలు చేసుకునేందుకు టాటా సన్స్‌కు నాలుగు వారాల వ్యవధినిచ్చింది.

ఇది గుడ్‌ గవర్నెన్స్‌ విజయం
ట్రిబ్యునల్‌ తీర్పుతో మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కులు, గుడ్‌ గవర్నెన్స్‌ సూత్రాలకు విజయం లభించింది. ఈ విషయంలో మా వాదనలే నెగ్గాయి. ఎలాంటి కారణం లేకుండా, ముందస్తుగా చెప్పకుండా నన్ను టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గాను, ఆ తర్వాత డైరెక్టర్‌గాను తొలగించారు. వీటిని వ్యతిరేకిస్తూ మేం చేసిన వాదనలు సరైనవే అనడానికి తాజా తీర్పు నిదర్శనం.  టాటా గ్రూప్‌ వృద్ధి చెందాలంటే కంపెనీలు, వాటి బోర్డులు, టాటా సన్స్‌ యాజమాన్యం.. బోర్డు, టాటా సన్స్‌ షేర్‌హోల్డర్లు .. అందరూ నిర్దిష్ట గవర్నెన్స్‌ నిబంధనలకు అనుగుణంగా కలిసి పనిచేయడం, అన్ని వర్గాల ప్రయోజనాలూ పరిరక్షించడం అవసరం.
– సైరస్‌ మిస్త్రీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top