టిక్‌టాక్‌కు మరో షాక్‌.. దావా వేసేందుకు సిద్ధం!

Music Publishers Threaten To Sue Tiktok Over Copyright - Sakshi

కాపీరైట్‌ నిబంధనల ఉల్లంఘన.. దావా వేయనున్న మ్యూజిక్‌ కంపెనీలు

వాషింగ్టన్‌: చైనీస్‌ యాప్‌ టిక్‌టాక్‌కు వరుసగా షాకులు తగులుతున్నాయి. 2019 ఫిబ్రవరిలో ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్(ఎఫ్‌టీసీ)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని(కన్సెంట్‌ డిక్రీ) ఉల్లంఘించిందని పలు అమెరికా అడ్వకసీ గ్రూపులు టిక్‌టాక్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన మ్యూజికల్‌.ఎల్‌వై(Musical.ly)ఒప్పందం కుదుర్చుకున్న టిక్‌టాక్‌ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని అతిక్రమించిందని ఎఫ్‌టీసీ ఇదివరకే సంస్థకు 5.7 మిలియన్‌ డాలర్ల మేరు జరిమానా విధించింది. ఇక ప్రస్తుత ఫిర్యాదుతో మరోసారి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తమ పాటలను యథేచ్చగా వాడుకుంటూ కాపీరైట్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు పలు టాప్‌ అమెరికన్‌ మ్యూజిక్‌ కంపెనీలు టిక్‌టాక్‌పై దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. (అప్పట్లో భారీ జరిమానా.. టిక్‌టాక్‌కు మరోదెబ్బ!)

పాటలకు పెదవి కలుపుతూ, నర్తిస్తూ
సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతున్న టిక్‌టాక్‌ పట్ల ఆకర్షితులు కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సినిమా పాటలు, భావోద్వేగాలు, డైలాగులకు అనుగుణంగా అభినయిస్తూ వీడియోలు అప్‌లోడ్‌ చేసే అవకాశం కల్పించిన ఈ యాప్‌ వల్ల ఎంతోమంది సామాన్యులు సెలబ్రిటీలుగా మారారు. దీంతో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది టిక్‌టాక్‌లో అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకుని తమ టాలెంట్‌ బయటపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా తమకిష్టమైన పాటలకు పెదవి కలుపుతూ.. నర్తిస్తూ ఫ్యాన్స్‌ను సంపాదించుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుని టిక్‌టాక్‌ ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. 

ఈ నేపథ్యంలో యూనివర్సల్‌ సహా పలు కంపెనీలు అనుమతి లేకుండా తమ పాటలను వినియోగించుకుంటున్నందుకు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి నేషనల్‌ మ్యూజిక్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ ఫైనాన్షియల్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. టిక్‌టాక్‌పై భవిష్యతులో దావా వేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం టిక్‌టాక్‌లో అందుబాటులో ఉన్న 50 శాతం మ్యూజిక్‌ లైసెన్స్‌ లేకుండానే పబ్లిష్‌ చేసిందన్నారు. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆడియో సంస్థగా పేరొందిన యూనివర్సల్‌ మ్యూజిక్‌.. లైసెన్స్‌ విషయంలో టిక్‌టాక్‌తో ఒప్పందం కుదర్చుకునేందుకు సం‍ప్రదింపులు జరుపుతోంది. తద్వారా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయాలని యోచిస్తోంది. 

రాయల్టీలు చెల్లించడం లేదు
కాగా యూనివర్సల్‌ సాంగ్‌రైటర్స్‌ బిల్లీ ఎలిష్‌, లేడీ గాగా, ఎల్టన్‌ జాన్‌, టేలర్‌ స్విప్ట్‌ వంటి ప్రఖ్యాత పాప్‌ సింగర్ల పాటలు వాడుకుంటున్న టిక్‌టాక్‌ వారికి రాయల్టీలు చెల్లించడం లేదు. ఈ క్రమంలో వారి క్రేజ్‌తో యూజర్లను ఆకట్టుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న టిక్‌టాక్‌లో మ్యూజిక్‌ ఒక ప్రధాన అవసరంగా మారిన నేపథ్యంలో పాటల కంపెనీలు ఈ మేరకు సంస్థ నుంచి తమకు రావాల్సిన మొత్తాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాగా 75 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు వెళ్లే యోచనలో ఉంది. (సాఫ్ట్‌బ్యాంకు బోర్డు సభ్యత్వానికి జాక్‌ మా రాజీనామా!)

జపాన్‌ దిగ్గజం సాప్ట్‌బ్యాంక్‌, సికోఇయా క్యాపిటల్‌ వంటి ఇన్వెస్టర్లను కలిగి ఉన్న ఈ సంస్థ పబ్లిక​ ఆఫర్‌ ప్రకటించనుందన్న వార్తల నేపథ్యంలో.. యూనివర్సల్‌ మ్యూజిక్‌ వారం రోజుల్లోగా తమ ప్రతిపాదనకు స్పందించి... లైసెన్సింగ్‌ డీల్‌పై అభిప్రాయం చెప్పాలని టిక్‌టాక్‌కు డెడ్‌లైన్‌ విధించింది. లేనిపక్షంలో న్యాయపోరాటానికి సిద్ధమవనున్నట్లు హెచ్చరించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక ఈ విషయం గురించి టిక్‌టాక్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ మ్యూజిక్‌ ఇండస్ట్రీతో వేల కొద్ది లైసెన్స్‌ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మేం గర్వపడుతున్నాం. అయితే వీటి గురించి మేం వివరాలు వెల్లడించలేం’’అని స్పష్టం చేశారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top