ఆసియా కుబేరుడు అంబానీ

Mukesh Ambani tops Jack Ma as Asia is richest person  - Sakshi

49.2 బిలియన్‌ డాలర్ల సంపదతో మళ్లీ అగ్రస్థానం

రెండో స్థానంలోకి ఆలీబాబా జాక్‌ మా

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా సైట్‌ ఫేస్‌బుక్‌తో డీల్‌ నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తాజాగా మళ్లీ ఆసియా కుబేరుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. డీల్‌ వార్తల కారణంగా రిలయన్స్‌ షేరు ఒక్కసారిగా ఎగియడంతో అంబానీ సంపద 4.7 బిలియన్‌ డాలర్ల మేర పెరిగి 49.2 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో చైనా దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మాను అధిగమించి అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. జాక్‌ మా కన్నా అంబానీ సంపద 3.2 బిలియన్‌ డాలర్లు అధికంగా ఉంది.

సంపన్నుల సంపదకు కొలమానంగా పరిగణించే బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. రిలయన్స్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్‌ సుమారు 10 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారానికి ముందు ఈ ఏడాది ఇప్పటిదాకా అంబానీ సంపద 14 బిలియన్‌ డాలర్ల మేర కరిగిపోయింది. డాలర్ల మారకంలో చూస్తే ఆసియాలో అత్యధికంగా నష్టపోయినది ముకేశ్‌ అంబానీయే. కానీ, ఫేస్‌బుక్‌ డీల్‌ కలిసి వచ్చి రిలయన్స్‌ షేరు పుంజుకోవడంతో మళ్లీ ఆసియా కుబేరుల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top