చిన్న షేర్లు కరెక్షన్‌లోనే!

Most of the cash inflows have come down - Sakshi

ఎన్నికల వరకూ వీటి జోలికెళ్లొద్దు 

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇండియా 

వైస్‌ ప్రెసిడెంట్‌ లక్ష్మీకాంత్‌ రెడ్డి 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారం, రియల్టీల్లో  నగదు పరమైన పెట్టుబడులు చాలా వరకూ తగ్గాయి. డిజిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌– అంటే స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. దీంతో ఒక్కసారిగా మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ షేర్లలోకి పెట్టుబడులు వచ్చాయి. ఒకదశలో లార్జ్‌ క్యాప్స్‌ షేర్ల కంటే ఇవే జోరు మీదున్నాయి కూడా. కానీ, ప్రస్తుతం మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ షేర్ల విలువలు  బాగా పెరిగిపోయాయని.. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ షేర్లు తిరోగమనంలో సాగుతున్నాయని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ (ఈక్విటీస్‌) లక్ష్మీకాంత్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల వరకూ అంటే 2–3 త్రైమాసికాల వరకూ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని.. ఆ తర్వాతే మళ్లీ  పరిస్థితి మెరుగుపడే అవకాశముందని ఆయన అంచనా వేశారు. విపణిలోకి కొత్తగా ఈక్విటీ సేవింగ్‌ ఫండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో మాట్లాడారు. ‘మిడ్, స్మాల్‌ క్యాప్స్‌లో పెట్టుబడులు జోలికి వెళ్లకపోవటమే మంచిది. ఒకవేళ పెట్టాల్సి వస్తే మాత్రం ఐదేళ్ల కాలపరిమితికి మించి ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమం’ అని సూచించారు. కాగా వచ్చే నెల 3–17 మధ్య ఫ్రాంక్లిన్‌ ఇండియా ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్‌ (ఎఫ్‌ఐఈఎస్‌ఎఫ్‌) అందుబాటులో ఉంటుందని కనీసం పెట్టుబడి రూ.5 వేలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.  

మెటల్, ప్రైవేట్‌ బ్యాంక్‌లే మేలు.. :ఆయిల్‌ ధరలు, వడ్డీ రేట్లు పెరగడం,  తగిన వర్షపాతంపై అనుమానాలు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), పెద్ద నోట్ల రద్దు వంటివాటితో మార్కెట్లలో ప్రతికూల వాతావరణం నెలకొందని దీంతో  కంపెనీలు పెద్దగా లాభాల్లో లేవని.. మొండి బకాయిల (ఎన్‌పీఏ) భారంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లూ ఇబ్బందుల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రైవేటు బ్యాంకులు, మెటల్‌ కంపెనీలు, ఆటోమొబైల్‌ కంపెనీల్లో పెట్టుబడులు ఉత్తమమని సూచించారు.   2014–17 మధ్య కాలాన్ని మార్కెట్ల సంవత్సరంగా అభివర్ణించవచ్చన్నారు. ఆయిల్‌ ధరల పెరుగుదల, ఎన్నికల ప్రభావంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ మార్కెట్లు ఒడిదుకుల్లోనే కొనసాగుతాయని తెలిపారు. ఉదాహరణకు 2014లో 6 వేల పాయింట్లుగా ఉన్న నిఫ్టీ,  ఎన్నిక సమయంలో తగ్గి.. ప్రస్తుతం మళ్లీ రికార్డు స్థాయిలకు చేరుకుందన్నారు. ఎన్నికల దృష్ట్యా మార్కెట్‌ ఒడిదుడుకులు తప్పవని విశ్లేషించారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top