ఒలెక్ట్రాకు ఎంఈఐఎల్‌ ఓపెన్‌ ఆఫర్‌

Meil open offer to Olectra Greentech - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్సుల వంటి పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌లో (గతంలో గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌) మెజారిటీ వాటాల కొనుగోలు దిశగా ఎంఈఐఎల్‌ హోల్డింగ్స్‌ త్వరలో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది. ఈ డీల్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న యస్‌ సెక్యూరిటీస్‌ ఇందుకు సంబంధించిన వివరాలను స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఈ నెల 21 లేదా అంతకు ముందే  ఓపెన్‌ ఆఫర్‌ వివరాలను పత్రికల్లో ప్రచురించనున్నట్లు తెలియజేసింది.

ఓపెన్‌ ఆఫర్‌లో రూ. 4 ముఖ విలువ గల 2.37 కోట్ల దాకా షేర్లను .. షేరు ఒక్కింటికి రూ.175.30 చొప్పున చెల్లించనున్నట్లు తెలిపింది. దీంతో ఇందుకోసం రూ. 415.58 కోట్లు వెచ్చించినట్లవుతుంది. ఇన్సులేటర్లు, ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రాలో ఎంఈఐఎల్‌ హోల్డింగ్స్, మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ కలిసి మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నాయి.

ఇందులో భాగంగా ఒలెక్ట్రా ప్రమోటరు సంస్థ ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్‌ నుంచి కోటి షేర్లతో పాటు ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ కింద 2.65 కోట్ల షేర్లు, 91 లక్షల వారంట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది దాదాపు 50.01 శాతం వాటాలకు సరిసమానం. దీంతో సెబీ నిబంధనల ప్రకారం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి వచ్చింది. సోమవారం ఒలెక్ట్రా షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ.10 పెరిగి రూ.215 వద్ద ముగిసింది. ఈ షేరు ఏడాది కనిష్ఠ ధర రూ.112 కాగా గరిష్ఠ ధర రూ.249. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top