చోక్సీ కోసం రెడ్‌ కార్నర్‌ నోటీసులు.. ఇంటర్‌పోల్‌కు ఈడీ ‘రిమైండర్‌’

Mehul Choksi says he has nothing left to give to PNB - Sakshi

న్యూఢిల్లీ: ఆభరణాల వర్తకుడు మెహుల్‌ చోక్సీకోసం రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌కు దరఖాస్తు పెట్టుకున్న ఈడీ, తాజాగా  మరో ‘రిమైండర్‌ నోటీసు’ పంపింది.  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను దాదాపు 2 బిలియన్‌ డాలర్ల మేర మోసం చేసి, చోక్సీ దేశం నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. చోక్సీపై రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేయాలని జూన్‌లో (ముంబై కోర్టులో చోక్సీపై ఈడీ చార్జ్‌షీట్‌ దాఖలైన వెంటనే) ఇంటర్‌పోల్‌కు ఈడీ దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం కావాలని ఇంటర్‌పోల్‌ కోరింది. దీనితో మరిన్ని వివరాలు అందిస్తూ ఈడీ తాజా ‘రిమైండర్‌’ అప్లికేషన్‌ దాఖలు చేసింది.

నీషల్‌ మోదీని రప్పించేందుకు సీబీఐ యత్నాలు
ఇదిలావుండగా,  నీరవ్‌మోదీ సోదరుడు నీషల్‌ మోదీని భారత్‌కు రప్పించే విషయంలో సీబీఐ తన ప్రయత్నాలు ఆరంభించినట్టు అధికార వర్గాలు తెలిపారు. ఇందుకు సంబంధించి సీబీఐ కేంద్ర హోంశాఖకు అభ్యర్థన పంపినట్టు పేర్కొన్నాయి. సీబీఐ వినతిని కేంద్ర హోంశాఖ బెల్జియంకు పంపనుంది.

నీషల్‌ మోదీ బెల్జియంలోనే తలదాచుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. బెల్జియం పౌరసత్వం కలిగిన నీషల్‌మోదీపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13,000 కోట్లకుపైగా మోసం చేసిన విషయం తెలిసిందే. ఇందులో నీషల్‌మోదీకి కూడా లబ్ధి కలిగినట్టు ఆరోపణ.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top