మందగమనంలోనూ ‘కలర్‌’ఫుల్‌..!

Market Value Of Paints In The Country Is Around Rs 50,000 Crore - Sakshi

విస్తరణలో సైతం దూసుకెళ్తున్న పెయింట్ల కంపెనీలు

ఏటా రెండంకెల వృద్ధి; పల్లెలకూ ప్రీమియం రంగులు

రూ.50,000 కోట్లకు పరిశ్రమ; భారీగా పెరిగిన షేర్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇల్లయినా, కార్యాలయమైనా అద్దంలా మెరవాలని అంతా అనుకుంటారు. అందుకే కొత్త కొత్త రంగులతో భవనానికి నూతన రూపు తెస్తుంటారు. యజమానులు తమ ఇంటికైనా, ఆఫీసుకైనా గతంలో 6–8 సంవత్సరాలకు ఒకసారి పెయింట్‌ వేయించేవారు. ఇప్పుడు 4–5 ఏళ్లకే వేయిస్తున్నారట. బెడ్‌ రూమ్స్, లివింగ్‌ రూమ్స్‌ విషయంలో అయితే తరచూ రంగులు మారుస్తున్న కస్టమర్లు పెరుగుతున్నారనేది కంపెనీల మాట. కస్టమర్ల ‘కలర్‌ఫుల్‌’ ఆలోచనలతో పెయింట్‌ కంపెనీలు కళకళలాడుతున్నాయి. ఏటా రెండంకెల వృద్ధి సాధిస్తూ పల్లెల్లో సైతం విస్తరిస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్లో మిడ్, స్మాల్‌క్యాప్‌ షేర్లు అంత బాగా లేకున్నా లిస్టెడ్‌ పెయింట్‌ కంపెనీల షేర్ల ధర ఏడాదిలో 65% దాకా పెరగడం పరిస్థితికి నిదర్శనం.  

గ్రామాలకూ పెద్ద బ్రాండ్లు..
ఇపుడు ప్రధాన బ్రాండ్లు గ్రామీణ ప్రాంతాలకూ చొచ్చుకుపోయాయి. మొత్తం పరిశ్రమలో వినియోగం పరంగా పట్టణాల వాటా 60% కాగా, మిగిలినది గ్రామీణ ప్రాంతాలది. ఈ మధ్య గ్రామాల్లోనూ ప్రీమియం రంగులు వాడుతుండటం విశేషం. వినియోగం పెరుగుతుండటంతో ప్రధాన కంపెనీలన్నీ ఎప్పటికప్పుడు తమ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాయి. ఏటా విస్తరణ, మార్కెటింగ్‌కు రూ.300–500 కోట్లు వెచ్చిస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటి వరకు రూ.10,000 కోట్ల దాకా పెట్టుబడులు వచ్చాయి. దిగ్గజ సంస్థలు పరిశోధన, అభివృద్ధికి టర్నోవరులో 1% దాకా వ్యయం చేస్తున్నాయి. 

రీ–పెయింటింగ్‌ ఎక్కువ..
డెకొరేటివ్‌ విభాగం మార్కెట్‌ విలువ రూ.40,000 కోట్లు. ఇందులో ఆయిల్‌ ఆధారిత పెయింట్లు 20%, వాటర్‌ బేస్డ్‌ 80%. ‘‘ఇపుడు త్వరగానే పెయింట్లు మారుస్తున్నారు. బెడ్‌ రూమ్స్, లివింగ్‌ రూమ్స్‌కైతే తరచూ మారుస్తున్నారు. డెకొరేటివ్‌ విభాగంలో వాడుతున్న రంగుల్లో 80% పాత గృహాలకు రీ–పెయింటింగ్‌ కోసమే. కొత్త గృహాల వాటా 20 శాతమే. కొత్త గృహాల్లో వ్యక్తిగత ఇళ్ల వాటా 80%, గృహ సముదాయాల వాటా 20%’’ అని జేఎస్‌డబ్లు్య పెయింట్స్‌ జేఎండీ ఏ.ఎస్‌.సుందరేశన్‌ ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో కు తెలిపారు.

దేశీ పెయింట్స్‌ పరిశ్రమ రెండు దశాబ్దాలుగా రెండంకెల వృద్ధి నమోదు చేస్తోంది. 2010కి ముందు వరకు ఏటా 12–15% వృద్ధి సాధించగా 2011 నుంచి ఇది 8–12%కి చేరిందని ‘టెక్నో పెయింట్స్‌’ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు. మరోవంక మార్కెట్‌ వొలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్‌ (వీఓసీ) వంటి రసాయనాలు లేని, లేదా అతి తక్కువ వీఓసీ ఉన్న పెయింట్లు వస్తున్నాయి. బ్యాక్టీరియాను దరిచేరనీయని, ఎక్కువ కాలం మన్నే రంగులను ప్రధాన కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి.

ఇదీ పెయింట్స్‌ మార్కెట్‌...
దేశంలో పెయింట్స్‌ విపణి విలువ దాదాపు రూ.50,000 కోట్లు. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా రూ.40,000 కోట్లుగా ఉంది. జాతీయ స్థాయి లో 10 వరకు బ్రాండ్లు పోటీపడుతుండగా... ప్రాంతీయ కంపెనీలు 100 వరకూ ఉన్నాయి. వినియోగం పరంగా దక్షిణ, పశ్చిమ భారత్‌ 55 శాతం, ఉత్తరాది 25, తూర్పు భారత్‌ 20 శాతం కైవసం చేసుకున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top