రిస్క్‌ తక్కువ... స్థిరమైన రాబడి

low risk.. constant return - Sakshi

డీఎస్‌పీబీఆర్‌ ఈక్విటీ అపార్చునిటీస్‌ ఫండ్‌

స్థిరమైన పనితీరుతో పాటు రిస్క్‌ తక్కువగా ఉండాలని కోరుకునే వారు డీఎస్‌పీబీఆర్‌ ఈక్విటీ అపార్చునిటీస్‌ ఫండ్‌ను పరిశీలించొచ్చు. సెబీ మార్పుల తర్వాత కూడా ఈ పథకం పనితీరులో ఎటువంటి మార్పుల్లేవు. ఇది ఇక ముందూ మల్టీక్యాప్‌గానే కొనసాగుతుంది.  

పనితీరు
ఈ ఫండ్‌ అన్ని కాలాల్లోనూ ప్రామాణిక సూచీ కంటే మెరుగైన రాబడులతో ముందున్నది. ఈ పథకం పనితీరుకు ప్రామాణిక సూచీ ఎన్‌ఎస్‌ఈ 500. మూడేళ్ల కాలంలో 14.6 శాతం, ఐదేళ్లలో 19.6 శాతం, పదేళ్లలో 13.4 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించిన పథకం ఇది. ఇదే కాలంలో బెంచ్‌ మార్క్‌ రాబడులు 12.8 శాతం, 16.3 శాతం, 10.9 శాతంగానే ఉండడం గమనార్హం. అంటే బెంచ్‌ మార్క్‌తో పోలిస్తే డీఎస్‌పీబీఆర్‌ ఈక్విటీ అపార్చునిటీస్‌ 2–5 శాతం వరకు అధిక రాబడులను అందించినట్టు తెలుస్తోంది.

అధిక శాతం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో మోస్తరు ఎక్స్‌పోజర్‌ రాబడులకు కారణం. మొత్తం నిధుల్లో 80% లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌కు, 10–15% మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు కేటాయించింది. అధిక వికేంద్రీకృత పోర్ట్‌ఫోలియో విధానంతో అన్ని మార్కెట్ల సమయాల్లోనూ మెరుగైన పనితీరుకు, కరెక్షన్‌లో పతనాన్ని పరిమితం చేయడం, అదే సమయంలో ర్యాలీల్లో మోస్తరు పనితీరుకు దోహదపడ్డాయి. అన్ని కాలాల్లోనూ మార్కెట్‌కు ధీటైన పనితీరు కోరుకునేవారు, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయదలిచిన వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.  

పోర్ట్‌ఫోలియో
గతంలో ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 50 స్టాక్స్‌ మేర ఉంటే, గడిచిన ఏడాది కాలంగా 70 స్టాక్స్‌పైగా కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్‌ సంఖ్య పెంచుకోవడం ద్వారా రిస్క్‌ తగ్గించే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు. బ్యాంకులు, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. పథకం మొత్తం నిధుల్లో 22.1 శాతం బ్యాంకింగ్‌ రంగంలోనే ఇన్వెస్ట్‌ చేసింది. ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌లో 9.1 శాతం పెట్టుబడులు పెట్టింది.

ఫార్మాలో 7.2 శాతం, కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టుల సంబంధిత స్టాక్స్‌లో 6.1 శాతం, ఆటోమొబైల్‌ రంగ స్టాక్స్‌లో 5.9 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో చూసుకుంటే మాత్రం ఈ పథకం పనితీరు ఆశించిన మేర లేదు. దీనికి కారణం బ్యాంకింగ్‌ రంగంలో అధిక పెట్టుబడులు పెట్టడమే. అయితే, ఇదే కాలంలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎక్స్‌పోజర్‌ తీసుకోవడం కలిసొచ్చింది.

ఆర్థిక వృద్ధి మెరుగుపడితే అధికంగా ప్రయోజనం పొందే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టి ఉంది. చమురు ధరలు పెరగడంతో పెట్రోలియం స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్‌ తగ్గించుకుంది. ఇక పథకం నిర్వహణలోని నిధుల్లో 5–7 శాతం మేర డెట్‌ పెట్టుబడులు, నగదు రూపంలో కలిగి ఉంది. ఐదేళ్లు, ఆ పై వ్యవధి కోసం ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు పరిశీలించతగిన పథకంగా చెప్పుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top