కారు.. బైక్‌ టాప్‌ గేర్‌!

Led by Maruti, automakers report robust sales in May - Sakshi

మే నెలలోనూ వాహన విక్రయాలు అదే జోరు..

మారుతీ సేల్స్‌ 25% పెరిగి 1,63,200 యూనిట్లకు

టాటా మోటార్స్‌ పీవీ విక్రయాల్లో 61 శాతం వృద్ధి

హోండా కార్స్‌ అమ్మకాలు @ 15,864 యూనిట్లు

బజాజ్‌ ఆటో విక్రయాలు 30 శాతం జంప్‌  

న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ స్పీడ్‌ మీదుంది. ఆటోమొబైల్‌ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరుసగా రెండో నెలలోనూ బలమైన అమ్మకాలు సాధించాయి. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్, హోండా కార్స్, ఫోర్డ్‌ ఇండియా కంపెనీలు మే నెల విక్రయాల్లో రెండంకెల వృద్ధిని నమోదుచేశాయి. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు కూడా పెరిగాయి. మరోవైపు మోటార్‌సైకిళ్లూ పరుగులు పెట్టాయి. వాహన విక్రయాలను పరిశీలిస్తే..

మారుతీ సుజుకీ ఇండియా దేశీ వాహన విక్రయాలు 24.9 శాతం వృద్ధితో 1,30,676 యూనిట్ల నుంచి 1,63,200 యూనిట్లకు పెరిగాయి. కాంపాక్ట్‌ కార్ల బలమైన అమ్మకాలు దీనికి కారణం.
 టాటా మోటార్స్‌ దేశీ ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాలు ఏకంగా 61 శాతం ఎగశాయి. ఇవి 10,855 యూనిట్ల నుంచి 17,489 యూనిట్లకు చేరాయి. ‘టియాగో, టిగోర్‌ మోడళ్ల డిమాండ్‌ నేపథ్యంలో కార్ల విక్రయాలు 18%పెరిగాయి. ఇక యుటిలిటీ వెహికల్స్‌లో 463 శాతం వృద్ధి నమోదయ్యింది. నెక్సాన్, హెక్జా బలమైన అమ్మకాలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి’ అని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీక్‌ తెలిపారు. ఇక సంస్థ దేశీ అమ్మకాలు 58 శాతం వృద్ధితో 34,461 యూనిట్ల నుంచి 54,295 యూనిట్లకు చేరాయి.
     హోండా కార్స్‌ దేశీ అమ్మకాలు 41% వృద్ధితో 11,278 యూనిట్ల నుంచి 15,864 యూనిట్లకు చేరాయి. కొత్త అమేజ్‌ బలమైన విక్రయాలు దీనికి కారణం. కస్టమర్‌ డిమాండ్‌ నేపథ్యంలో అమేజ్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నామని సంస్థ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్, డైరెక్టర్‌ రాజేశ్‌ గోయెల్‌ చెప్పారు.
 హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా దేశీ అమ్మకాలు 7 శాతం పెరిగాయి. ఇవి 42,007 యూనిట్ల నుంచి 45,008 యూనిట్లకు చేరాయి.
 మహీంద్రా అండ్‌ మహీంద్రా దేశీ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు (స్కార్పియో, ఎక్స్‌యూవీ500 సహా) 20,715 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది మే నెల అమ్మకాలు 20,392 యూనిట్లతో పోలిస్తే 2 శాతం వృద్ధి కనిపించింది. ఇక సంస్థ దేశీ అమ్మకాలు 8% వృద్ధితో 40,710 యూనిట్ల నుంచి 43,818 యూనిట్లకు పెరిగాయి.
ఫోర్డ్‌ ఇండియా దేశీ వాహన విక్రయాలు 6,742 యూనిట్ల నుంచి 9,069 యూనిట్లకు ఎగశాయి. 35 శాతం వృద్ధి కనిపించింది. బలమైన బ్రాండ్, సరైన ప్రొడక్ట్, అందుబాటు ధర వంటి అంశాలు తమ వృద్ధికి కారణమని ఫోర్డ్‌ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అనురాగ్‌ మెహ్రోత్రా తెలిపారు. కమోడిటీ, ఫ్యూయెల్‌ ధరల పెంపు వల్ల పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్నారు.
 
టూ వీలర్‌ రయ్‌..
టూ వీలర్‌ విభాగానికి వస్తే.. మార్కెట్‌ లీడర్‌ హీరో మోటొకార్ప్‌ అమ్మకాలు 11 శాతం వృద్ధితో 7,06,365 యూనిట్లకు చేరాయి. బజాజ్‌ ఆటో విక్రయాల్లో 30 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 3,13,756 యూనిట్ల నుంచి 4,07,044 యూనిట్లకు పెరిగాయి. టీవీఎస్‌ మోటార్‌ మొత్తం అమ్మకాలు 10 శాతం వృద్ధితో 3,09,865 యూనిట్లకు ఎగశాయి.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మొత్తం విక్రయాలు 23 శాతం వృద్ధితో 74,697 యూనిట్లకు పెరిగాయి. హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ మొత్తం అమ్మకాలు 3 శాతం వృద్ధితో 5,51,601 యూనిట్లకు ఎగశాయి. సుజుకీ మోటార్‌సైకిల్‌ దేశీ విక్రయాలు 37 శాతం వృద్ధితో 53,167 యూనిట్లకు పెరిగాయి. ఇక అశోక్‌ లేలాండ్‌ మొత్తం అమ్మకాలు 51 శాతం వృద్ధితో 13,659 యూనిట్లకు చేరాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top