పేటీఎమ్‌ నష్టాలు.. బుల్లెట్‌ ట్రైన్‌ బడ్జెట్‌ అంత ! | Kotak Research On Paytm Losses | Sakshi
Sakshi News home page

పేటీఎమ్‌ నష్టాలు.. బుల్లెట్‌ ట్రైన్‌ బడ్జెట్‌ అంత !

Nov 30 2018 8:50 AM | Updated on Nov 30 2018 8:50 AM

Kotak Research On Paytm Losses - Sakshi

ముంబై:  భారత్‌లో ఈ కామర్స్‌ సంస్థలకు భారీగా నష్టాలు వస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఈ నష్టాలు మరింతగా పెరగగలవని కోటక్‌ రీసెర్చ్‌ తాజా నివేదిక వెల్లడించింది. మొబైల్‌ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌ రెండేళ్ల క్రితం ఆరంభించిన పేటీఎమ్‌ మాల్‌కు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,806 కోట్ల మేర నష్టాలు వచ్చాయని ఈ నివేదిక పేర్కొంది. ఈ నష్టాలు.... ముంబై–అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైయిన్‌ ప్రాజెక్ట్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఏడాది కేటాయించిన  రూ.1,800 కోట్ల బడ్జెట్‌కు సమానమని వివరించింది.   ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., 

పేటీఎమ్‌ కంపెనీ 2016–17 ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్‌ మాల్‌తో ప్రత్యేక ఈ కామర్స్‌ కంపెనీని ఏర్పాటు చేసింది.  
ఇప్పటివరకూ ఈ రంగంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ సంస్థలకు  భారీ నష్టాలు వచ్చేవి.  
తాజాగా ఈ జాబితాలో పేటీఎమ్‌ కూడా చేరింది.  
గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్‌ మాల్‌కు రూ.744 కోట్ల ఆదాయం రాగా, రూ.1,806 కోట్ల నష్టాలు వచ్చాయి.  
పేటీఎమ్‌ మాల్‌కు 2016–18 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రూ.1,971 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇది, ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీ సమీకరించిన మొత్తం నిధుల్లో (రూ..4,508 కోట్లు) 44 శాతానికి సమానం.  
భారత ఈ కామర్స్‌ రంగంలో  నష్టాలు భారీగా వస్తున్నా, వాల్‌మార్ట్, అమెజాన్‌ కంపెనీలు తమ భారత సంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తున్నాయి. పేటీఎమ్‌కు దన్నుగా ఉన్న ఆలీబాబా కూడా ఇదే రీతిగా ఆలోచిస్తోంది.  
భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థల్లో పేటీఎమ్‌ మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లు ఉన్నాయి.  
సాఫ్ట్‌బ్యాంక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్, అలీబాబాడాట్‌కామ్‌ల నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో పేటీఎమ్‌ మాల్‌ రూ.2,900 కోట్లు సమీకరించింది.

Advertisement
 
Advertisement
Advertisement