రెండు ఐపీవోలకు సెబీ ఓకే  | Deepa Jewellers and Cotec Healthcare Receive SEBI Approval for IPO | Sakshi
Sakshi News home page

రెండు ఐపీవోలకు సెబీ ఓకే 

May 26 2026 5:15 AM | Updated on May 26 2026 5:15 AM

Deepa Jewellers and Cotec Healthcare Receive SEBI Approval for IPO

కోటెక్‌ హెల్త్‌కేర్, దీపా జ్యువెలర్స్‌ రెడీ 

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రెండు కంపెనీలు ఐపీవో చేపట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జాబితాలో హైదరాబాద్‌ కంపెనీ దీపా జ్యువెలర్స్‌తోపాటు ఫార్మాస్యూటికల్‌ రంగ సంస్థ కోటెక్‌ హెల్త్‌కేర్‌ చేరాయి. 2025 సెపె్టంబర్‌లో కోటెక్‌ హెల్త్, డిసెంబర్‌లో దీపా జ్యువెలర్స్‌ సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. తాజా అనుమతులతో ఐపీవో చేపట్టడం ద్వారా రెండు కంపెనీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌కానున్నాయి. 

ఈక్విటీ జారీ.. 
ఫార్మా రంగ కంపెనీ కోటెక్‌ హెల్త్‌కేర్‌ పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రూ. 295 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 60 లక్షల షేర్లను కంపెనీ ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 226 కోట్లు కొత్త ప్రాజెక్ట్‌పై వెచ్చించనుంది. తద్వారా ప్రస్తుత తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంతోపాటు.. కొత్త ప్రొడక్టుల తయారీని చేపట్టనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా దేశీ ఫార్మా రంగంలో కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్, తయారీ(సీడీఎంవో) సేవలను సమకూర్చుతోంది. 

హాల్‌మార్క్‌తో.. 
ఐపీవోలో భాగంగా హాల్‌మార్క్‌ కలిగిన బంగారు ఆభరణాలు సరఫరా చేసే దీపా జ్యువెలర్స్‌ రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా 1,18,48,340 షేర్లను కంపెనీ ప్రమోటర్లు ఆశిష్‌ అగర్వాల్, సీమా అగర్వాల్‌ విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 215 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్‌కు వెచ్చించనుంది. 2016లో ఏర్పాటైన కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా.. కర్ణాటక, తమిళనాడు, కేరళలో కార్యకలాపాలు విస్తరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement