జియో తగ్గింది.. ఎయిర్‌టెల్‌ పుంజుకుంది!

Jio 4G Download Speed Declined By 8 Per Cent In December - Sakshi

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు అన్‌లిమిటెడ్‌ డేటాతో వినోదాన్ని అందిస్తున్న టెలికాం సంచలనం రిలయన్స్‌ జియో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ గణనీయంగా తగ్గిందని ట్రాయ్‌ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) వెల్లడించింది. గతేడాది నవంబరులో 20.3 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడుతో సరికొత్త రికార్డును నమోదు చేసిన జియో.. డిసెంబరులో మాత్రం ఈ స్పీడును 8 శాతానికి తగ్గించి(18.7 ఎంబీపీఎస్‌)  యూజర్లను నిరాశపరిచింది. కాగా జియో దాటికి తట్టుకోలేక చతికిల పడిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌- ఐడియా మాత్రం ఓ మోస్తరుగా స్పీడును పెంచాయి. నవంబరులో 9.7 ఎంబీపీఎస్‌గా ఎయిర్‌టెల్‌ 4జీ నెట్‌వర్క్‌ డౌన్‌లోడ్‌ స్పీడు డిసెంబరులో 9.8 ఎంబీపీఎస్‌కు చేరింది.

ఇక జియో నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు ఒకే గొడుగు కిందకి వచ్చినప్పటికీ వొడాఫోన్‌- ఐడియాల డౌన్‌లోడ్‌ స్పీడు మాత్రం మెరుగుపడలేదు. అయితే ఈ రెండు నెట్‌వర్క్‌లకు సంబంధించిన గణాంకాలను ట్రాయ్‌ విడివిడిగానే ప్రకటించింది. నవంబరులో 6.8 ఎంబీపీఎస్‌గా ఉన్న వొడాఫోన్‌ స్పీడు.. డిసెంబరులో 6.3 ఎంబీపీఎస్‌.. అదేవిధంగా ఐడియా డౌన్‌లోడ్‌ స్పీడు నవంబరులో 5.6 ఎంబీపీఎస్‌ కాగా డిసెంబరులో 5.3 ఎంబీపీఎస్‌కు తగ్గింది. అయితే డౌన్‌లోడ్‌ స్పీడు తగ్గినప్పటికీ ఏడాది కాలంగా ఈ కేటగిరీలో జియో తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం.

డేటా షేరింగ్‌, బ్రౌజింగ్‌, వీడియోల వీక్షణ తదితర అంశాల్లో కీలకమైన నెట్‌వర్క్‌ స్పీడు యూజర్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పీడు కాస్త తగ్గినప్పటికీ ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే జియోనే తన కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఇక అప్‌లోడింగ్‌ విషయానికొస్తే... నవంబరులో 4.5 ఎంబీపీఎస్‌గా ఉన్న జియో స్పీడు డిసెంబరులో 4.3కి తగ్గగా..  వొడాఫోన్‌ మాత్రం 4.9 నుంచి 5.1ఎంబీపీఎస్‌కి స్పీడును పెంచిందని ట్రాయ్‌ పేర్కొంది. మైస్పీడ్‌ యాప్‌ రూపొందించిన డేటా స్పీడ్‌ వివరాల ఆధారంగా ట్రాయ్‌ ఈ గణాంకాలను వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top