జెట్‌లో కొనసాగుతున్న ఉద్వాసనలు

Jet Airways continues with incremental layoffs to cut cost - Sakshi

మరో 16 మంది ఉద్యోగుల తొలగింపు

హైదరాబాద్‌ కార్యాలయం మూసివేత

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా మరో 16 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. వీరంతా హైదరాబాద్, కొచి కార్యాలయాల్లో పని చేస్తున్న గ్రౌండ్‌ స్టాఫ్‌ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిమిత స్థాయిలో కొద్ది కొద్దిగా ఉద్యోగులను తొలగించడం చేస్తోంది.  ఇప్పటికే హైదరాబాద్‌లోని కార్యాలయాన్ని మూసివేసింది. ఇందులో నలుగురైదుగురు సిబ్బంది ఉండేవారు. గతవారం కొచ్చి కార్యాలయంలో పనిచేస్తున్న వారిలో కొందరికి వైదొలగాలంటూ సూచన కూడా చేసింది. మొత్తం మీద ఈ రెండు కార్యాలయాలకు సంబంధించి 16 మందిని తొలగించినట్లయింది‘ అని సంబంధిత వర్గాలు వివరించాయి. గత నెలాఖరులోనే 20 మంది ఉద్యోగులకు జెట్‌ ఉద్వాసన పలికింది. వీరిలో సీనియర్‌ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు మొదలుకుని ఇన్‌–ఫ్లయిట్‌ సర్వీసుల విభాగాలకు చెందిన సిబ్బంది దాకా ఉన్నారు. అంతకు ముందు ఇంజినీరింగ్, సెక్యూరిటీ, సేల్స్‌ తదితర విభాగాల్లో మేనేజర్‌ స్థాయిలోని 15 మంది దాకా ఉద్యోగులను తప్పుకోవాలని సంస్థ సూచించినట్లు సమాచారం. జెట్‌ ఎయిర్‌వేస్‌లో 16,000 పైచిలుకు ఉద్యోగులున్నారు.  

టర్నెరౌండ్‌ ప్రణాళికలో భాగం.. 
ఉద్యోగుల తొలగింపు అంశంపై స్పందిస్తూ... టర్న్‌ అరౌండ్‌ ప్రణాళికలో భాగంగా నిర్దిష్ట నగరాల్లో వనరులను సమర్థంగా వినియోగించుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. దీని ప్రకారంగానే నెట్‌వర్క్, సిబ్బంది వినియోగం తదితర అంశాలను సమగ్రంగా సమీక్షిస్తున్నామని, లాభసాటిగా లేని రూట్ల నుంచి మెరుగైన రూట్ల వైపు వనరులను మళ్లిస్తున్నామని పేర్కొంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ వరుసగా మూడు త్రైమాసికాలుగా భారీ నష్టాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.1,261 కోట్లు నష్టాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో వివిధ వనరుల ద్వారా నిధు లు సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో వినయ్‌ దూబే ఇటీవలే వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top