ఒడిదుడుకుల వారం...

ఒడిదుడుకుల వారం...


న్యూఢిల్లీ:  బడ్జెట్ నేపథ్యంలో ఈ వారంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు మరింతగా పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. నేడు(సోమవారం) వెలువడే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు, వారం రోజుల తర్వాత చైనా స్టాక్ మార్కెట్ సోమవారం ప్రారంభం కావడం, ముడి చమురు ధరలు రికవరీ కావడం, రూపాయి కదలికలు తదితర అంశాలు  కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్ పూర్తవడంతో ఇక ఇన్వెస్టర్ల దృష్టి కేంద్ర బడ్జెట్‌పై పడుతుందని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(మిడ్‌క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు.



ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాం కాల ప్రభావం కూడా ఉంటుందన్నారు.  గత ఏడాది డిసెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి ప్రతికూలంగానే ఉండడం వల్ల సమీప భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లో తీవ్ర స్థాయిలోనే ఒడిదుడుకులు తప్పవని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ చెప్పారు.



చైనా సూచీల ప్రభావం

వారం రోజుల సెలవుల అనంతరం చైనా మార్కెట్ సోమవారం నుంచే ప్రారంభమవుతుందని, చైనా స్టాక్ సూచీల కదలికలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని కోటక్ సెక్యూరిటీస్ హెడ్(ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్) దీపేన్ షా అంటున్నారు. బడ్జెట్ నేపథ్యంలో రంగాల వారీ కదలికలు చోటు చేసుకుంటాయని అంతర్జాతీయ పరిణామాల ప్రభావమూ ఉంటుందని వివరించారు.  



చైనా మార్కెట్ ఎలా ఉంటుందోనని ప్రపంచమార్కెట్లన్నీ ఎదురు చూస్తున్నాయని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్ పంకజ్ శర్మ చెప్పారు. గత వారంలో ప్రపంచ మార్కెట్లలో అల్లకల్లోలం చెలరేగిన నేపథ్యంలో చైనా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు పట్ల ఇన్వెస్టర్లు ఎలా ప్రతిస్పందిస్తారో ఈ వారం తెలుస్తుందని వివరించారు. చైనా స్టాక్ సూచీల గమనం ఈక్విటీ మార్కెట్‌పైననే కాక, రూపాయిపైన కూడా ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు.

 

పతనం కొనసాగుతుంది..!

ప్రస్తుత స్టాక్ మార్కెట్  పతనం ఈ వారమూ  కొనసాగుతుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా అంచనా వేస్తున్నారు. నిలకడైన రికవరీ సాధించాలంటే, ముందు మార్కెట్ స్థిరత్వాన్ని పొందాలని, గత వారం క్షీణత వేగాన్ని చూస్తే ఆ అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయని వివరించారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ గత వారంలో 1,631 పాయింట్లు(6.62%), నిఫ్టీ 508 పాయింట్లు (6.78%) చొప్పున నష్టపోయాయి. స్టాక్ సూచీలు 21 నెలల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి.

 

విదేశీ నిధుల ఉపసంహరణ

అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగించిందనే భయాలతో భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు గత రెండు వారాల్లో రూ.2,254 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అయితే డెట్‌మార్కెట్లో మాత్రం రూ.962 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top