
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ 2030 నాటికి 6.5–7 ట్రిలియన్ డాలర్ల (6.5–7 లక్షల కోట్ల డాలర్లు) శ్రేణికి చేరే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేబ్రాయ్ గురువారం పేర్కొన్నారు. 2035–40 నాటికి ఈ విలువ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కూడా ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 2.1 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఏడవది. ఇక తలసరి ఆదాయం సైతం 2030 నాటికి 4,000 డాలర్లకు (ప్రసుతం 1,709 డాలర్లు)చేరే అవకాశం ఉందని స్కోచ్ సదస్సులో పాల్గొన్న వివేక్ దేబ్రాయ్ అన్నారు.
అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ తన పాత్రను గణనీయంగా మెరుగుపరచుకోనుందని ఆయన ఈ సదస్సులో పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే, చాలా మంది ఇతరుల కోసం ఉపాధి అవకాశాలను సైతం సృష్టిస్తున్నారు.’’ అని వివేక్ దేబ్రాయ్ పేర్కొన్నారు. దేశంలో భూ యాజమాన్యానికి సంబంధించిన వ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలో పది అతిపెద్ద ఎకానమీలు