‘అరవింద్‌’ సమేత..

Indian-origin Arvind Krishna elected new CEO of IBM - Sakshi

ఆంధ్రుడికే ఐబీఎం పగ్గాలు..

సీఈవోగా అరవింద్‌ కృష్ణ నియామకం  ∙బోర్డులోనూ చోటు; ఏప్రిల్‌ 6 నుంచి అమల్లోకి  

న్యూయార్క్‌: మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల తరవాత... మరో అమెరికన్‌ ఐటీ దిగ్గజానికి సారథ్యం వహించే అవకాశం ఇంకో తెలుగు వ్యక్తికి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరవింద్‌ కృష్ణ (57)... ఐటీ దిగ్గజం ఐబీఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (సీఈవో) నియమితులయ్యారు. 200 బిలియన్‌ డాలర్ల సంస్థ డైరెక్టర్ల బోర్డులోనూ ఆయనకు చోటు దక్కింది. ఏప్రిల్‌ 6 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్‌ కృష్ణ... 1990లో ఐబీఎంలో చేరారు.

అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ... ప్రస్తుతం సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (క్లౌడ్, కాగ్నిటివ్‌ సాఫ్ట్‌వేర్‌) స్థాయికి చేరారు. ‘సీఈవోగా ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుత సీఈవో వర్జీనియా రొమెటీ, బోర్డ్‌ నా మీద ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. ఐటీ పరిశ్రమ శరవేగంగా మారిపోతున్న ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఐబీఎం సిబ్బంది, క్లయింట్లతో కలిసి పనిచేయడం చాలా బాగుంటుంది. వ్యాపారాలను మరింతగా మెరుగుపర్చుకునేలా క్లయింట్లకు తోడ్పడటానికి ఇదో అద్భుతమైన అవకాశం‘ అని కృష్ణ పేర్కొన్నారు. ఆయనతో పాటు రెడ్‌ హ్యాట్‌ సీఈవో, ఐబీఎం సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ జేమ్స్‌ వైట్‌హస్ట్‌.. ఐబీఎం ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

కొత్త శకానికి.. సరైన సారథి
‘ఐబీఎం తదుపరి శకానికి కృష్ణ సరైన సారథి. క్లౌడ్, కాగ్నిటివ్‌ శకంలో కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సరైన వ్యక్తి. ఐబీఎం చరిత్రలోనే అత్యంత భారీ కొనుగోలు అయిన ‘రెడ్‌ హ్యాట్‌’ డీల్‌కు ఆయనే సూత్రధారి. అరవింద్‌ కృష్ణ అద్భుతమైన టెక్నాలజిస్టు. ఐబీఎంకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ వంటి కీలక టెక్నాలజీలను రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించారు. విలువలకు ప్రాధాన్యమిచ్చే నాయకుడు‘ అని వర్జీనియా రొమెటీ (62) వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా ఐబీఎంలో వివిధ హోదాల్లో పనిచేసిన రొమెటీ ఇక ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగుతారు. ఈ ఏడాది ఆఖర్లో  రిటైరవుతారు. సీఈవోగా బాధ్యతలు అప్పగించేందుకు సరైన వ్యక్తి కోసం సాగిన అన్వేషణలో.. అరవింద్‌ కృష్ణ ఎంపికయ్యారని ఐబీఎం లీడ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ ఎస్క్యూ పేర్కొన్నారు.

సమోసా పార్టీ..!

అరవింద్‌ కృష్ణ నియామకంపై దేశీ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.  భారతీయుల సామర్థ్యాలకు తాజా నియామకం నిదర్శనమని మహీంద్రా ట్వీట్‌ చేశారు. అదే సమయంలో ఇకపై వైట్‌హౌస్‌ ఎప్పుడైనా టెక్‌ దిగ్గజాల సదస్సుల్లాంటివి ఏర్పాటు చేస్తే.. హాంబర్గర్ల స్థానంలో కచ్చితంగా భారతీయులకిష్టమైన సమోసాలుండేలా చూసుకోవాల్సి వస్తుందంటూ సరదాగా పేర్కొన్నారు. సాంబర్‌ వడ, మసాలా చాయ్‌ లాంటివి కూడా పెట్టాలంటూ నెటిజన్లు లిస్టులో మరిన్ని చేర్చారు.  

ప్రస్థానం ఇలా...

పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్‌ కృష్ణ.. ఊటీలోని కూనూర్‌లో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించారు. తరవాత ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిలో పీహెచ్‌డీ చేశారు. ఐఈఈఈ, ఏసీఎం జర్నల్స్‌కు ఎడిటర్‌గా వ్యవహరించడంతో పాటు 15 పేటెంట్లకు ఆయన సహ–రచయిత. 1990లో ఐబీఎంలో చేరి.. 30 ఏళ్లుగా అందులోనే కొనసాగుతున్నారు. సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కాకముందు.. ఆయన ఐబీఎం సిస్టమ్స్‌లో జనరల్‌ మేనేజర్‌ హోదాలో పనిచేశారు. అంతకన్నా ముందు.. ఐబీఎం సాఫ్ట్‌వేర్, ఐబీఎం రీసెర్చ్‌ విభాగాల్లో టెక్నాలజిస్టుగా పనిచేశారు.  

సిలికాన్‌ వ్యాలీలో భారతీయ జెండా..
అరవింద్‌ కృష్ణ నియామకంతో టెక్నాలజీ రంగంలో భారతీయుల సత్తా మరోసారి చాటినట్టయింది. అమెరికా సిలికాన్‌ వ్యాలీలోని నాలుగు అతిపెద్ద బహుళజాతి కంపెనీలకు ఇప్పుడు భారతీయులే సీఈఓలు. ప్రధానంగా గూగుల్‌ సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ సత్య నాదెళ్ల ప్రపంచ టాప్‌ టెక్నాలజీ కంపెనీలకు అధిపతులుగా ఉన్నారు. ఇతర ఎంఎన్‌సీల విషయానికొస్తే... మాస్టర్‌కార్డ్‌ సీఈఓ అజయ్‌ బంగాతో పాటు పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి కూడా అత్యంత సుపరిచితులే. వారినొకసారి చూస్తే...

సుందర్‌ పిచాయ్‌: తమిళనాడుకు చెందిన పిచాయ్‌ 2015లో గూగుల్‌ సీఈఓగా నియమితులయ్యారు. 47 ఏళ్ల పిచాయ్‌కు తాజాగా గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓ బాధ్యతలు కూడా అప్పగించి కంపెనీ ప్రమోటర్లు వైదొలగడం ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.

సత్య నాదెళ్ల: 1992లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగిగా ప్రస్థానాన్ని  ప్రారంభించిన నాదెళ్ల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం. హైదరాబాద్‌లో హైస్కూల్‌ విద్యను అభ్యసించారు. 2014లో స్టీవ్‌బామర్‌ నుంచి మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. శంతను నారాయణ్‌:  యాపిల్‌లో కెరీర్‌ను ప్రారంభిం చిన నారాయణ్‌ 1998లో అడోబ్‌ సిస్టమ్స్‌లో వైస్‌–ప్రెసిడెంట్‌గా జాయిన్‌ అయ్యారు. 2007లో ఏకంగా ఆ కంపెనీ సీఈఓగా నియమితులయ్యారు.  హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌ చేశారు.

జార్జ్‌ కురియన్‌: కేరళలోని కొట్టాయంకు చెందిన కురియన్‌... అమెరికా దిగ్గజం సిస్కో సిస్టమ్స్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. స్టోరేజ్‌ అండ్‌ డేటా మేనేజ్‌మెంట్‌ కంపెనీ ‘నెట్‌యాప్‌’కు 2015లో ప్రెసిడెంట్, సీఈఓగా నియమితులయ్యారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top