ఎన్‌పీఏల సమస్యను అధిగమించే స్థాయికి బ్యాంకులు

Indian banks on top of situation over NPA problem - Sakshi

 తిరిగి లాభాల్లోకి వస్తున్నాయి

ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌

న్యూయార్క్‌: భారత బ్యాంకులు మొండి బకాయిల (ఎన్‌పీఏలు) సమస్యను అధిగమించే స్థాయికి వచ్చేశాయని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో వస్తున్న ఫలితాలను బట్టి బ్యాంకులు తిరిగి లాభాల్లోకి వస్తున్నట్టు అర్థమవుతోందన్నారు.  ఎక్కువగా స్టీల్, విద్యుత్‌ రంగాలకు ఇచ్చిన రుణాల రూపంలో ఇది ఉందని, అయితే, ఎక్కువ శాతం ప్రభావం ముగిసిందని చెప్పారాయన. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఆస్తుల నాణ్యత సవాలును ఎదుర్కొంటున్నాయి. గత మూడు సంవత్సరాలుగా ఇది కొనసాగింది. కానీ, ఈ సమస్య విషయంలో చివరి దశలో ఉన్నాం’’ అని కుమార్‌ తెలిపారు.

విద్యుత్‌ రంగానికి సంబంధించి ఎన్‌పీఏలను బ్యాంకులు ఇప్పటికీ పరిష్కరించుకునే స్థితిలో లేవన్నారు. అయితే, దివాలా బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) బ్యాంకులకు మేలు చేస్తున్నదని, ప్రస్తుతం ఓ పరిష్కారం అనేది అందుబాటులో ఉందని చెప్పారాయన. బ్యాంకులకు, రుణదాతలకు ఐబీసీ అన్నది మంచి సాధనంగా పేర్కొన్నారు. చమురు ధరలు స్థిరపడితే, రూపాయి కూడా కుదురుకుంటుందని చెప్పారు. ‘‘దేశీయంగా ఆర్థిక రంగం మంచి పనితీరులో ఉంది. కానీ పెరుగుతున్న చమురు ధరలు అతిపెద్ద అవరోధంగా తయారయ్యాయి. ఎందుకంటే ఇది దేశ కరెంటు ఖాతా లోటుపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది’ అని ఆయన అన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top