భారత వృద్ధి రేటు ఈ ఏడాది 7.4 శాతం

India to grow at 7.4 per cent in 2018 - Sakshi

వచ్చే ఏడాది 7.8 శాతం

చైనా రేటు 6.6 శాతమే: ఐఎంఎఫ్‌

వాషింగ్టన్‌: భారత్‌ ఈ ఏడాది వృద్ధి రేటులో చైనాను వెనక్కి నెట్టేస్తుందని, 7.4% చొప్పున వృద్ధి చెందుతుందని, వచ్చే ఏడాది వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. పొరుగున్న ఉన్న చైనా వృద్ధి రేటు మాత్రం ఇదే కాలంలో 6.6%, 6.4%గానే ఉంటుందని ఐఎంఎఫ్‌ తెలిపింది. 2017 రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు బాగా తగ్గిన అనంతరం పుంజుకోవడం మొదలైందని, 2018, 2019 సంవత్సరాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ప్రస్థానం కొనసాగుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.

ఈ మేరకు ప్రపంచ ఆర్థిక రంగంపై తాజా అంచనాలను వెలువరించింది. డీమోనిటైజేషన్, జీఎస్టీ వంటి విధానాల ఫలితంగా 2017లో మన దేశ జీడీపీ వృద్ధి రేటు 6.7%కి పడిపోయిన విషయం విదితమే. అదే ఏడాది చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.9%కి చేరుకోవడంతో భారత్‌ను వెనక్కి నెట్టేసింది. అంతకు ముందు వరకు మన దేశమే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంది.

స్వల్పకాలంలో వృద్ధి రేటు పెరుగుదలకు డీమోనిటైజేషన్, జీఎస్టీ అమలు ప్రభావాల నుంచి బయటకు రావడం, ప్రైవేటు వినియోగం బలంగా ఉండడం వంటివి సానుకూలతలుగా ఐఎంఎఫ్‌ పేర్కొంది. జీఎస్టీ కారణంగా వాణిజ్య పరమైన అడ్డంకులు తొలగి, సమర్థత పెరుగుతుందని, పన్ను వసూళ్లు అధికమవుతాయని అంచనా వేసింది. మధ్య కాలానికి కూడా భారత వృద్ధి రేటు బలంగానే ఉంటుందని పేర్కొంటూనే, సమగ్రాభివృద్ధి అనే సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది.

పెట్టుబడులపై రుణభారం
కార్పొరేట్‌ కంపెనీలు అధిక రుణ భారాన్ని మోస్తుండడం, బ్యాంకింగ్‌ రంగంలో మొండిబకాయిల సమస్యలు భారత్‌లో పెట్టుబడులపై ప్రభావం చూపించొచ్చని ఐఎంఎఫ్‌ పేర్కొంది. పీఎన్‌బీ స్కామ్‌ను ఈ సందర్భంగా ప్రస్తావించింది. చాలా వరకు వర్ధమాన దేశాల్లో బ్యాలన్స్‌షీట్లపై ఒత్తిళ్ల వల్ల మధ్యకాలంలో వృద్ధితగ్గిపోయే రిస్క్‌ ఉందని అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో విధానపరమైన చర్యలు అవసరమని నివేదికలో సూచించింది. బ్యాంకుల రుణాల రికవరీ యంత్రాంగం మరింత వేగం సంతరించుకోవాలని, ప్రభుత్వం ప్రకటించిన రీక్యాపిటలైజేషన్‌ వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top