ఇండియా సిమెంట్స్‌కు నష్టం రూ. 31 కోట్లు | India Cements net loss at Rs 31 crore; hit by slump in demand | Sakshi
Sakshi News home page

ఇండియా సిమెంట్స్‌కు నష్టం రూ. 31 కోట్లు

May 27 2014 12:15 AM | Updated on Sep 2 2017 7:53 AM

గడిచిన ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి)లో ఇండియా సిమెంట్స్ రూ. 30.6 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.

 చెన్నై: గడిచిన ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి)లో ఇండియా సిమెంట్స్ రూ. 30.6 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) క్యూ4లో రూ. 26.3 కోట్ల నికర లాభాన్ని సాధించింది. స్టాండెలోన్ ఫలితాలివి. సిమెంట్‌కు డిమాండ్ మందగించడం, సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమైనట్లు కంపెనీ వైస్‌చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ పేర్కొన్నారు. దక్షిణాదిలో డిమాండ్‌కు మించిన సరఫరా ఉండటంతో సిమెంట్ అమ్మకపు ధరలపై ఒత్తిడి పడినట్లు చెప్పారు. 2009లో ఆంధ్రప్రదేశ్‌లో సిమెంట్‌కు 24 లక్షల టన్నుల డిమాండ్ నమోదుకాగా, ప్రస్తుతం 16 లక్షల టన్నులకు పరిమితమైనట్లు తెలిపారు. కాగా, క్యూ4లో నికర అమ్మకాలు కూడా రూ. 1,191 కోట్ల నుంచి రూ. 1,080 కోట్లకు క్షీణించాయి.

 పూర్తి ఏడాదికి
 పూర్తి ఏడాదికి(2013-14) కంపెనీ రూ. 117 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. అంతక్రితం ఏడాదిలో రూ. 188 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక నికర అమ్మకాలు సైతం రూ. 5,159 కోట్ల నుంచి రూ. 5,085 కోట్లకు తగ్గాయి. సిమెంట్‌కు తగిన స్థాయిలో డిమాండ్ పుంజుకునేందుకు కనీసం ఆరు నెలల కాలం పడుతుందని శ్రీనివాసన్ అంచనా వేశారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి సిమెంట్ అమ్మకాలు పెరిగే అవకాశమున్నదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అమ్మకాలు పడిపోగా, తమిళనాడు, కేరళలో సిమెంట్‌కు మంచి డిమాండ్ ఉన్నదని చెప్పారు. దేశీ కరెన్సీ మారకంలో హెచ్చుతగ్గులు, రైల్వే రవాణా చార్జీల్లో పెరుగుదల వంటి అంశాలు కూడా ఫలితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా రూ. 166 కోట్ల ఆదాయం సమకూరినట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కంపెనీ షేరు దాదాపు 5% పతనమై రూ. 99 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement