
‘రిటర్న్’ చక్రాలు ఆగవ్..!
మీరు బస్సో, క్యాబో మరో వాహనమో ఎక్కారనుకోండి. మీరు వెళ్ళాల్సిన చోటు వచ్చాక దిగిపోతారు. అందుకు కొంత చార్జీలు చెల్లిస్తారు
ఆన్‌లైన్‌లో ట్రక్, లోడ్‌ను బుక్ చేసుకునే వీలు
♦ తక్కువ ఖర్చుకే లాస్ట్ మినిట్ డీల్స్
♦ దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న రిటర్న్‌ట్రక్స్.ఇన్
♦ అమెరికా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లకూ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మీరు బస్సో, క్యాబో మరో వాహనమో ఎక్కారనుకోండి. మీరు వెళ్ళాల్సిన చోటు వచ్చాక దిగిపోతారు. అందుకు కొంత చార్జీలు చెల్లిస్తారు. కాకపోతే ఆ చార్జీల్లో మీ తిరుగు ప్రయాణానికయ్యే చార్జీలు కూడా కలిపే ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ సదరు వాహనదారుకు గనక అట్నుంచి రిటర్న్ వేరే కస్టమర్ దొరక్కపోతే..! ఈ ఆలోచనతోనే ఒకవైపు చార్జీల్లోనే రెండువైపులవీ ఇమిడి ఉండేలా నిర్ణయిస్తారు. కొన్ని కంపెనీలు మాత్రం ప్రయాణికుల విషయంలో దీన్ని మినహాయిస్తుంటాయి. కానీ, సరకు రవాణాకు వచ్చేసరికి ఏ కంపెనీ అయినా పక్కాగా రెండువైపుల చార్జీలనూ వసూలు చేస్తుంటాయి.
ఎందుకంటే తిరుగు ప్రయాణంలో వాహనం ఖాళీగా వస్తుందని!! కాకపోతే విశాఖ పట్నం కేంద్రంగా పనిచేస్తున్న ‘రిటర్న్‌ట్రక్స్.ఇన్’ మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. దీన్ని ఆరంభించిన సుధాకర్ వింత... అత్యవసరంగా చేరాల్సిన లోడ్ చేరకపోవడంతో తనకెదురైన ఇబ్బందులు. మరెవరూ పడకూడదనే ఉద్దేశంతోనే దీన్ని ఆరంభించారు. అది కూడా... ఫార్చ్యూన్ 50 కంపెనీలో ఉద్యోగం వదిలేసి మరీ..! ఈ కంపెనీ గురించి ఆయన ఏం చెబుతారంటే...
‘‘అమెరికాలో యాహూ, సిస్కో, టయోటా వంటి కంపెనీల్లో సుమారు 15 ఏళ్ల పాటు పనిచేశా. సొంతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ కిడ్స్ పేరుతో ఎడ్యుకేషన్ రంగంలో మొబైల్ యాప్స్ తయారు చేసే సంస్థను ఆరంభించాను. ఒక రోజు పని మీద సొంతూరైన విశాఖపట్నానికి తిరిగొచ్చాను. అత్యవసరంగా ఒక లోడ్‌ను గుంటూరు నుంచి విశాఖపట్నానికి తెచ్చుకోవాలి. ఇందుకోసం నేను, మా కజిన్ కలసి ఓ ఏజెంట్‌ను సంప్రతించాం. గంటలో ట్రక్ వస్తుందని చె ప్పాడా ఏజెంట్.
మూడు రోజులు ఎదురుచూసినా ట్రక్ రాలేదు. ఏజెంట్‌కు ఫోన్ చేస్తే స్పందించడు. అప్పుడే అనిపించింది.. 400 కి.మీ. కూడా సరిగా లేని ఇక్కడికే ట్రక్ రావడానికి ఇంత సమయం పడితే... వేల కి.మీ. దూరంలో ఉన్న లోడ్‌ను సరఫరా చేయాలంటే ఎన్ని సమస్యలో అని. బట్టలు, సెల్‌ఫోన్లలాగే టెక్నాలజీని ఆధారంగా చేసుకుని ట్రక్స్‌నూ ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సౌలభ్యం ఉంటే బాగుండు కదా అని’’!! ఆ ఉద్దేశంతోనే రూ.కోటి పెట్టుబడితో 2014లో రిటర్న్‌ట్రక్స్.ఇన్‌కు బీజం వేశాం.
రిటర్న్‌ట్రక్స్.ఇన్ పనేంటంటే..
ప్రస్తుతం మన దేశంలో లాజిస్టిక్ వ్యాపారంలో ఇటు సంస్థలకు, అటు ప్రజలకు మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు. దీంతో చాలా ఇబ్బందులెదరువుతున్నాయి. ఎక్కడ లోడ్ ఉందో ట్రక్ ఓనర్లకు తెలియదు. అందుబాటు ధరల్లో ట్రక్ దొరుకుతుందో లేదో సరకు ఓనర్లకూ తెలీదు. దీనికి సరైన పరిష్కారం చూపించేదే రిటర్న్‌ట్రక్స్.ఇన్. ఉదాహరణకు ఒక లోడ్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి చేరాలనుకుందాం. లోడ్ ఓనర్ లోడ్, గమ్యస్థానాన్ని మా వెబ్‌సైట్‌లో బుక్ చేస్తాడు. వెంటనే ఆ వివరాలు ఈ సైట్‌లో రిజిస్టరైన ట్రక్ ఓనర్లందరికీ ఎస్‌ఎంఎస్ రూపంలో వెళతాయి. వాళ్లు ఆ లోడ్‌ను చేరవేసేందుకు అయ్యే ఖర్చును (బిడ్) వెబ్‌సైట్లో పోస్ట్ చేస్తారు. వీటిని వెంటనే లోడ్ ఓనర్‌కు పంపిస్తాం. ఎవరైతే తక్కువకు బిడ్ చేస్తారో అందులో నుంచి ఒకరిని లోడ్ ఓనరే స్వయంగా ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్, యాప్‌లో బుక్ చేసుకునే సౌలభ్యం లేనివాళ్ల కోసం 18002085623 టోల్‌ఫ్రీ నంబర్ కూడా ఉంది.
7 టన్నుల నుంచి మొదలు...
రిటర్న్‌ట్రక్స్.ఇన్‌లో ట్రక్‌ల సామర్థ్యం 7 టన్నుల నుంచి మొదలవుతుంది. మాంసాహార ఉత్పత్తులు, పాలు, పండ్ల వంటి ఉత్పత్తుల సరఫరా నిమిత్తం ప్రత్యేకంగా ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే వాహనాలూ ఉన్నాయి. ఇంట్లోని ఫర్నీచర్‌ను షిఫ్ట్ చేసేందుకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. జీపీఎస్ సాంకేతిక విధానంతో ట్రక్ ఎక్కడుంది? ఎంత సమయంలో చేరుతుందనే విషయాలను ఎప్పటికప్పుడు లోడ్, ట్రక్ ఓనర్లకు ఎస్‌ఎంఎస్ రూపంలో తెలియజేస్తుంటాం కూడా. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా సహా దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్నాం. ఇప్పటివరకు 10 వేల మంది కస్టమర్లకు సేవలందించాం. ప్రస్తుతం రిటర్న్‌ట్రక్స్.ఇన్‌లో దేశవ్యాప్తంగా 1,800 మంది లోడ్ ఓనర్లు, 6 వేల మంది ట్రక్ ఓనర్లు రిజిస్టరై ఉన్నారు. అమెరికా, సౌదీ, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ దేశాలకు విస్తరించనున్నాం. విస్తరణ నిమిత్తం మరో రెండు నెలల్లో నిధుల సమీకరణకు రానున్నాం.
నెలకు రూ.2 కోట్ల వ్యాపారం...
మార్జిన్ల కంటే సరైన సమయంలో, తక్కువ ఖర్చుతో లోడ్‌ను చేరవేయటమే మా లక్ష్యం. అందుకే ప్రతి లోడ్ మీద 5% చార్జీ మాత్రమే వసూలు చేస్తాం. అంటే దాదాపు రూ.500-1,000 చార్జీ ఉంటుంది. ప్రస్తుతం రోజుకు 100-125 లోడ్లను షిప్ట్ చేస్తున్నాం. నెలకు రూ.2 కోట్ల వ్యాపారాన్ని చేరుకుంటున్నాం. ట్రక్‌ను బుక్ చేసుకున్నాక 50 శాతం పేమెంట్.. లోడ్ చేరుకున్నాక మిగిలిన మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. రిటర్న్‌ట్రక్స్.ఇన్ ప్రత్యేకత ఏంటంటే.. లాస్ట్ మినిట్ డీల్స్! ఇదేంటంటే.. నవత, బీఎంపీఎస్, గతి, క్రాంతి వంటి రవాణా సంస్థలు తీసుకెళ్లే ట్రక్కులో ఖాళీగా ఉన్న స్థలాన్ని మేం వినియోగించుకుంటాం. అంటే ఆయా ట్రక్స్ వెళ్లే మార్గంలో ఉన్న లోడ్‌ను ఒక చోటు నుంచి మరో చోటుకు పంపించే వీలుంటుంది. దీంతో లోడ్ ఓనర్‌కు తక్కువ ఖర్చు.. ట్రక్ ఓనర్లకు అదనంగా డబ్బు సమకూరుతుంది. మరో ప్రత్యేకత ఏంటంటే.. లోడ్ ఇన్య్సూరెన్స్‌ను కూడా రిటర్న్‌ట్రక్స్.ఇన్‌లో చేసుకోవచ్చు.