పుంజుకోనున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థ!

 IMF forecasts India GDP at 7.5% in FY20 and 7.7% in FY21 - Sakshi

2019, 2020పై  ఐఎంఎఫ్‌ నివేదిక

ద్రవ్యలోటుపై మాత్రం తీవ్ర ఆందోళన

తగ్గనున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు

అవుట్‌లుక్‌ను విడుదల చేసిన గీతా గోపీనాథ్‌  

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2019, 2020లో ఊపందుకోనున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. ఈ రెండు సంవత్సరాల్లో వరుసగా 7.5 శాతం, 7.7 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. అంతకుముందు అంచనాలకన్నా ఇది 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) ఎక్కువ.  ఈ రెండు సంవత్సరాల్లో చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంటుందని వివరించింది. తద్వారా భారత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న దేశంగా నిలుస్తుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. క్రూడ్‌ ధరలు తక్కువగా ఉండడం, నిత్యావసరాల ధరల పెరుగుదల స్పీడ్‌ తగ్గడం, కఠిన ద్రవ్య పరపతి విధాన ప్రక్రియ నెమ్మదించడం భారత్‌ వృద్ధి పురోగతికి కారణంగా వివరించింది.  ఐఎంఎఫ్‌ మొట్టమొదటి మహిళా చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌ విడుదల చేసిన

నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు...
►ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటుపై భారత్‌లో ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి.
► ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తోంది. 2019, 2020ల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.5, 3.6 శాతాలుగా ఉంటాయి. గతంతో పోల్చితే ఈ అంచనాలు వరుసగా 0.2 శాతం 0.1 శాతం తక్కువ. పలు దేశాల్లో వృద్ధి మందగమనం దీనికి కారణం.  

పెరగనున్న రాష్ట్రాల ద్రవ్యలోటు: ఇండియా రేటింగ్స్‌
ఎన్నికల సంవత్సరంలో రాష్ట్రాల ద్రవ్యలోటు పెరగనుందని ఫిచ్‌ గ్రూప్‌ కంపెనీ– ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌  తాజా నివేదిక తెలిపింది.  వ్యవసాయ రుణాల మాఫీ, ఇతర స్కీమ్‌లు ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించింది.

28 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి వెల్లడించిన చైనా ఎన్‌బీఎస్‌ 
బీజింగ్‌: చైనా గత ఏడాది 6.6 శాతం వృద్ధిని సాధించింది. 1990 తర్వాత ఇదే అత్యంత తక్కువ స్థాయి జీడీపీ వృద్ధి రేటు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 6.5 శాతంగా ఉన్న వృద్ధి ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో 6.4 శాతానికి పడిపోయిందని చైనా నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌బీఎస్‌) వెల్లడించింది. 2017లో 6.8 శాతంగా ఉన్న జీడీపీ 2018లో 6.6 శాతానికి తగ్గింది. ఇది 28 సంవత్సరాల కనిష్ట స్థాయి. అమెరికాతో ఉన్న వాణిజ్య సవాళ్లు దీనికి ప్రధాన కారణం. 

కార్పొ బ్రీఫ్స్‌...
శ్రేయీ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిస్టింగ్‌పై కసరత్తు.. విలీన స్కీమ్‌ ద్వారా ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ వ్యాపార విభాగాన్ని స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయనున్నట్లు శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ చైర్మన్‌ హేమంత్‌ కనోడియా తెలిపారు. సిడ్బిలో వాటా విక్రయించనున్న కెనరా బ్యాంక్‌.. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్‌ (సిడ్బి)లోని కోటి షేర్లను విక్రయించాలని కెనరా బ్యాంక్‌ ప్రతిపాదించింది. ఈ అమ్మకానికి సంబంధించి.. ఒక్కో షేరు ఫ్లోర్‌ ప్రైస్‌ రూ.225 వద్ద నిర్ణయించినట్లు రాయిటర్స్‌ వెల్లడించింది. మరోవైపు ఎన్‌ఎస్‌డీఎల్‌లోని 4 లక్షల షేర్లను రూ.850 ఫ్లోర్‌ ప్రైస్‌ వద్ద విక్రయించనున్నట్లు తెలుస్తోంది.గుజరాత్‌లో నూతన సెల్లో ప్లాంట్‌ ప్రారంభం బీఐసీ సెల్లో ఇండియా రూ.300 కోట్ల వ్యయంతో గుజరాత్‌లోని వాపిలో ఏర్పాటుచేసిన అతిపెద్ద స్టేషనరీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందులో 1,500 మంది ఉద్యోగులను నియమించుకోగా.. వీరిలో 70 శాతం మహిళలే ఉన్నట్లు తెలిపింది.   టాటా టెలీ, ఎయిర్‌టెల్‌ విలీనానికి ఆమోదంనష్టాల్లో కూరుకుపోయిన టెలికం సంస్థ– టాటా టెలీసర్వీసెస్‌ను భారతీ ఎయిర్‌ టెల్‌లో విలీనం చేసేందుకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ అనుమతి ఇచ్చింది. ఈ విలీనానికి టెలికమ్యునికేషన్స్‌ శాఖ అనుమతి లభించాల్సి ఉంది. అక్టోబర్‌ 2017లో విలీన ప్రకటన వెలువడింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top