ఇంధనాల రిటైలింగ్‌లో పోటీకి ఊతం

ICRA Reporting on Fuel License Cancel - Sakshi

పెట్రోల్‌ బంకు లైసెన్సు నిబంధనల సడలింపు మంచిదే

పీఎస్‌యూల గుత్తాధిపత్యం తగ్గుతుంది: ఇక్రా నివేదిక

న్యూఢిల్లీ: పెట్రోల్‌ బంకుల ఏర్పాటు లైసెన్సుకు సంబంధించిన నిబంధనలను సడలించాలన్న నిపుణుల కమిటీ సిఫార్సులు అమలు చేస్తే ఇంధనాల రిటైలింగ్‌ రంగంలో పోటీకి తోడ్పాటు లభిస్తుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థల (ఓఎంసీ) గుత్తాధిపత్యానికి గండిపడుతుందని, అవి కూడా పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడగలదని తెలిపింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌ మొదలైన ఇంధనాల రిటైల్‌ బంకులు ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు హైడ్రోకార్బన్‌ ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్‌లైన్స్, ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) టెర్మినల్స్‌పై రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయాల్సిందేనని నిబంధనలు ఉన్నాయి. అయితే, చమురు, గ్యాస్‌ రంగంలో అంత భారీగా ఇన్వెస్ట్‌ చేసే కంపెనీలకు ఇలాంటి రవాణా ఇంధనాల విక్రయ లైసెన్సులు పెద్ద ప్రోత్సాహకాలుగా అనిపించవని కేంద్ర ప్రభుత్వం అయిదుగురు సభ్యులతో నియమించిన నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.

కాబట్టి రూ. 2,000 కోట్ల పెట్టుబడుల నిబంధనను ఎత్తివేస్తే వైవిధ్యంగా ఇంధన విక్రయ సేవలు అందించగలిగే సంస్థలకు అవకాశం లభించగలదని ఒక నివేదికలో సూచించింది. చాలా సున్నితమైన, నిత్యావసర ఉత్పత్తులైన ఇంధనాలను సురక్షితంగా విక్రయించేందుకు అనేక జాగ్రత్తలు అవసరమవుతాయి కాబట్టి దీని రిటైలింగ్‌ లైసెన్సులకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా ఉండాల్సిందేనని పేర్కొంది. దరఖాస్తుదారు సామర్ధ్యం, పూర్వ చరిత్ర ప్రాతిపదికగా లైసెన్సుల జారీ ఉండాలని సూచించింది. సిఫార్సుల ప్రకారం కొత్త సంస్థలు.. ఏడేళ్ల కాలంలో కనీసం 100 రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ఏర్పాటు చేయాలి. వీటిలో 5 శాతం బంకులు నిర్దేశిత మారుమూల ప్రాంతాల్లో ఉండాలి.

ఇప్పటిదాకా 9 ప్రైవేట్‌ సంస్థలకే లైసెన్సులు..
2002లో ఇంధనాల రిటైలింగ్‌ రంగంలోకి ప్రైవేట్‌ సంస్థలను కూడా అనుమతించిన తర్వాత నుంచి ఇప్పటిదాకా కేవలం తొమ్మిది సంస్థలకు మాత్రమే అనుమతులు లభించినట్లు ఇక్రా పేర్కొంది. పీఎస్‌యూయేతర ఓఎంసీల మార్కెట్‌ వాటా 2013 మార్చి ఆఖరు నాటికి 6 శాతంగా ఉండగా.. 2019 మార్చి 31 నాటికి 10 శాతానికి చేరింది. ప్రైవేట్‌ రంగంలో ప్రస్తుతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్‌ ఆయిల్‌), రాయల్‌ డచ్‌ షెల్‌ సంస్థలు మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రిలయన్స్‌కి సుమారు 1,400 అవుట్‌లెట్స్‌ ఉన్నాయి. నయారాకు 5,128 బంకులు, షెల్‌కు 145 బంకులు ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన బీపీ కొన్నాళ్ల క్రితమే 3,500 అవుట్‌లెట్స్‌ ఏర్పాటుకు లైసెన్సు దక్కించుకున్నా, ఇంకా కార్యకలాపాలు ప్రారంభించలేదు. అదానీ గ్రూప్‌తో కలిసి 1,500 పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు గతేడాది ఫ్రాన్స్‌ దిగ్గజం టోటల్‌ వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top