ఏమో! ఏం కార్పొరేట్‌ గవర్నెన్సో!!

ICICI Bank's corporate governance in doubt  - Sakshi

ఐసీఐసీఐ బ్యాంకుపై ఫిచ్‌ సందేహాలు

బ్యాంకుపై ఆంక్షలు, పెనాల్టీలకు అవకాశం

ఇన్వెస్టర్ల విశ్వాసం దెబ్బతినొచ్చని వ్యాఖ్య

రిస్క్‌ పెరిగితే రేటింగ్‌ మారుస్తామని వెల్లడి  

ముంబై: ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ఆ బ్యాంకులో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలను ఎత్తి చూపించేవిగా ఉన్నాయని అంతర్జాతీయ రేటింగ్స్‌ ఏజెన్సీ ఫిచ్‌ వ్యాఖ్యానించింది. అడ్డగోలుగా ఇచ్చిన రుణాలు మొండిబాకీలుగా మారి బ్యాంకింగ్‌ వ్యవస్థను కుదిపేస్తున్న ఈ తరుణంలో... తాజా వివాదం వల్ల ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రతిష్ట మసకబారే ప్రమాదముందని ఒక నివేదికలో పేర్కొంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచర్‌ .. తన భర్త దీపక్‌ కొచర్‌ సంస్థకు లబ్ధి చేకూర్చేలా క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాలిప్పించారంటూ ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఫిచ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వివాదంపై సీబీఐతో పాటు ఈడీ వంటి ఏజెన్సీలు కూడా విచారణ జరుపుతున్నాయి.

స్వతంత్ర దర్యాప్తు ఎందుకు లేదు?
వీడియోకాన్‌కు ఇచ్చిన రుణాలపై నిర్ణయం తీసుకున్న కమిటీలో చందా కొచర్‌ కూడా ఉండటం, స్వతంత్ర ఏజెన్సీలతో దర్యాప్తునకు బ్యాంకు సుముఖంగా లేకపోవడం మొదలైన అంశాలన్నీ ఐసీఐసీఐలో పాటిస్తున్న కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విధానాల పటిష్టతపై సందేహాలు రేకెత్తించేవిగా ఉన్నాయని ఫిచ్‌ వ్యాఖ్యానించింది.

దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడయ్యే అంశాలను బట్టి బ్యాంకుపై నియంత్రణ సంస్థ ఆంక్షలు విధించే అవకాశాలున్నాయని పేర్కొంది. దీంతో పాటు ఆర్థికంగా జరిమానాలు విధించడం, చట్టపరమైన చర్యలు తీసుకునే రిస్కులు కూడా ఉండొచ్చని వివరించింది. ఈ పరిణామాలతో బ్యాంకుపై ఇన్వెస్టర్ల విశ్వాసం సైతం దెబ్బతింటుందని పేర్కొంది.

రేటింగ్‌పరమైన రిస్కులు..
బ్యాంక్‌కి సంబంధించిన పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని, ఒకవేళ బ్యాంకు ప్రతిష్టను.. ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసే రిస్కులు పెరిగితే రేటింగ్‌పరమైన చర్యలు తీసుకుంటామని ఫిచ్‌ తెలిపింది. పరిస్థితి తీవ్రమైతే బ్యాంకు నిధుల సమీకరణ వ్యయాలపై, లిక్విడిటీపై ప్రతికూల ప్రభావం పడొచ్చని ఫిచ్‌ తెలిపింది.

అయితే, వ్యవస్థలో కీలకమైన బ్యాంకు కావటంవల్ల ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయొచ్చని తెలియజేసింది. ఒకవేళ బ్యాంకు యాజమాన్యం తప్పు చేసిందని విచారణలో తేలితే... ప్రైవేట్‌ బ్యాంకులు సమర్థవంతమైన నాయకత్వంతో మెరుగైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలు అమలు చేస్తున్నాయన్న అభిప్రాయం పోయే ప్రమాదముందని వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top