
6.9 శాతానికి పెంచిన ఫిచ్
క్యూ1లో బలమైన జీడీపీ రేటు
వినియోగం పెరిగే చాన్స్
ఫిచ్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాలను పెంచింది. జీడీపీ 6.5 శాతం వృద్ధి చెందుతుందన్న గత అంచనాను 6.9 శాతం చేసింది. జూన్ త్రైమాసికంలో అంచనాలకు మించి బలమైన పనితీరు నమోదు కావడం, దేశీ వినియోగ ఆధారిత డిమాండ్ పుంజుకోవడాన్ని అంచనాలు పెంచేందుకు కారణాలుగా పేర్కొంది. అమెరికా టారిఫ్‌లతో భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు లోగడ పలు అంతర్జాతీయ ఏజెన్సీలు ప్రకటించగా.. అంచనాలను పెంచిన తొలి సంస్థ ఫిచ్ కావడం గమనార్హం.
మార్చి, జూన్ త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగాన్ని పుంజుకున్నట్టు ఫిచ్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. జీడీపీ జనవరి–మార్చి త్రైమాసికంలో 7.4 శాతం వృద్ధి చెందగా, జూన్ త్రైమాసికంలో 7.8 శాతానికి పెరగడాన్ని ప్రస్తావించింది. వాస్తవానికి జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని ఫిచ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తన అంచనాలను ప్రకటించగా, దీనికి మించి బలమైన వృద్ధి రేటు నమోదైంది. దీనికి తోడు జీఎస్‌టీలో తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ మంచి వృద్ధిని నమోదు చేస్తుందంటూ తాజా అంచనాలను ఫిచ్ విడుదల చేసింది.
వినియోగమే బలమైన చోదకం..
‘‘అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు ఇటీవలి నెలల్లో పెరిగాయి. భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం అదనపు టారిఫ్‌లు విధించగా, ఇవి ఆగస్ట్ 27 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో అమెరికాలో భారత ఉత్పత్తులపై టారిఫ్‌లు 50 శాతానికి పెరిగాయి. చర్చల ద్వారా టారిఫ్ రేట్లు అంతిమంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. వాణిజ్య సంబంధాల విషయంలో నెలకొన్న అనిశ్చితి వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. పెట్టుబడులపై దీని ప్రభావం పడుతుంది. జీఎస్‌టీలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సెపె్టంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వినియోగం బలంగా పెరుగుతుంది’’అని ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. వృద్ధికి దేశీ వినియోగం కీలక చోదకంగా పనిచేస్తుందని తెలిపింది. సానుకూల ఆర్థిక పరిస్థితులు పెట్టుబడులను ఇతోధికం చేస్తాయని అంచనా వేసింది. కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో వృద్ధి కొంత నిదానిస్తుందని ఫిచ్ అభిప్రాయపడింది.
2026–27లో 6.3 శాతం..
2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.3 శాతానికి, తదుపరి ఆర్థిక సంవత్సరంలో (2027–28)లో 6.2 శాతానికి పరిమితం అవుతుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. సగటు కంటే అధిక వర్షపాతం, అధిక నిల్వలతో ఆహార ధరలు తక్కువ స్థాయిలోనే కొనసాగుతాయని తెలిపింది. దీంతో ద్రవ్యోల్బణం 2025 చివర్లోనే 3.2 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2026 చివరికి 4.1 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది. ఆర్‌బీఐ ఈ ఏడాది చివరికి పావు శాతం రేటు తగ్గిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.
ఇదీ చదవండి: రొయ్యల ఎగుమతులకు టారిఫ్ ఎఫెక్ట్..