
ఈసారి 12 శాతం తగ్గనున్న పరిశ్రమ ఆదాయం
ఇండ్–రా నివేదిక
రొయ్యల ఎగుమతిదార్లపై అమెరికా టారిఫ్‌ల ప్రభావం భారీగానే ఉండనుంది. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) పరిశ్రమ ఆదాయం 12 శాతం క్షీణించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ఒక నివేదికలో తెలిపింది. భారత ఫ్రోజెన్ రొయ్యలకు అమెరికా కీలక మార్కెట్‌గా ఉంటోంది. ఎగుమతుల పరిమాణంలో 41 శాతం, విలువపరంగా 48 శాతం వాటా అమెరికాదే ఉంటోంది. 50 శాతం ప్రతీకార సుంకాల (అదనంగా యాంటీ–డంపింగ్ డ్యూటీ మొదలైనవి కూడా కలిపితే 58 శాతం) వల్ల వాణిజ్యం గణనీయంగా దెబ్బతింటుందని నివేదిక పేర్కొంది. దీనితో ఈక్వెడార్, వియత్నాం, ఇండొనేషియాలాంటి దేశాలతో భారత్ పోటీపడలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఫలితంగా ఎగుమతుల పరిమాణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించింది.
ప్రధాన రొయ్యల కంపెనీల ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ ప్రకారం 2025–26లో ఆదాయాలు 12 శాతం మేర, మార్జిన్లు సుమారు 150 బేసిస్ పాయింట్ల (దాదాపు ఒకటిన్నర శాతం) మేర తగ్గే అవకాశం ఉందని ఇండ్–రా తెలిపింది. నిర్వహణ మూలధనంపరంగా కూడా కొంత ఒత్తిడి నెలకొనవచ్చని వివరించింది. అధిక టారిఫ్‌లను అమెరికా కొనసాగిస్తే మధ్యకాలికంగా రొయ్యల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం తప్పదని పేర్కొంది. ఎగుమతుల పరిమాణం, మార్జిన్లపై ఒత్తిళ్ల వల్ల ఆర్థికంగా అంత పటిష్టంగా లేని మధ్య స్థాయి సంస్థల రుణపరపతి దెబ్బతినే అవకాశం ఉన్నట్లు వివరించింది.
ఇతర దేశాల వైపు చూపు ..
భారతీయ రొయ్యల ప్రాసెసింగ్ సంస్థలు దేశీ మార్కెట్‌తో పాటు అమెరికాయేతర మార్కెట్లలోకి (చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, బ్రిటన్) కూడా మరింతగా విస్తరించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు ఇండ్–రా అసోసియేట్ డైరెక్టర్ ఆదర్శ్ గుత్తా తెలిపారు. అయితే, ఈ ప్రాంతాల్లో అంతగా అధిక ధర లభించదని, పైగా పరిమిత స్థాయిలోనే ఎగుమతి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. వ్యూహాత్మక డైవర్సిఫికేషన్, ఉత్పత్తులకు మరింత విలువను జోడించడంపై పెట్టుబడులు పెట్టడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంలాంటివి పోటీతత్వాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెట్టుకునేందుకు కీలకంగా ఉంటాయని ఆదర్శ్ చెప్పారు.
ఇదీ చదవండి: లంచం కేసు సెటిల్మెంట్ చేసుకున్న సంస్థ