హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ప్యాసింజర్లు మరణించడం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు ప్రయాణికుల భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ, స్లీపర్ బస్సుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా వ్యవస్థలు, వాటిని ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడానికి కింది భద్రతా వ్యవస్థలు, సదుపాయాలు ఎంతో అవసరం అవుతాయి.
ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రత)
అగ్నిప్రమాదాల వల్ల బస్సుల్లో తీవ్రత అధికంగా ఉంటుంది. ఏసీ, స్లీపర్ బస్సుల్లో కిటికీలు తెరవడానికి వీలులేకపోవడం, తక్కువ ఎంట్రీ/ ఎక్జిట్ మార్గాలు ఉండడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ లేదా ఇతర భాగాల్లో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పొగ వచ్చినప్పుడు వెంటనే డ్రైవర్‌ను, ప్రయాణికులను అప్రమత్తం చేసే సెన్సార్ ఆధారిత అలారం వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా, సులభంగా ఉపయోగించగలిగే కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫైర్ ఎక్స్‌టింగ్యుషర్‌లు ఉండాలి.
ఎమర్జెన్సీ ఎక్జిట్
సాధారణ ఎంట్రీ/ ఎక్జిట్ ద్వారాలు కాకుండా బస్సులో కనీసం రెండు సులభంగా తెరవగలిగే అత్యవసర ద్వారాలు (కిటికీలు లేదా హాచ్‌లు) తప్పనిసరిగా ఉండాలి. ఈ మార్గాలను స్పష్టంగా గుర్తించేలా ఏర్పాటు చేయాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిప్రమాదం తీవ్రతను తగ్గించడానికి ఇంధన సరఫరాను ఆటోమేటిక్‌గా నిలిపివేసే వ్యవస్థ ఉండాలి.
ఫస్ట్ ఎయిడ్ (ప్రథమ చికిత్స) కిట్
ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో బ్యాండేజీలు, యాంటీసెప్టిక్ వైప్స్, కత్తెర, పట్టీలు, నొప్పి నివారణ మందులు (చిన్న గాయాలు, తలనొప్పి, వాంతులు మొదలైన వాటికి), బర్న్ క్రీమ్స్ వంటి ప్రాథమిక వైద్య సామాగ్రి అందుబాటులో ఉంచాలి. డ్రైవర్, అటెండర్లు ఈ పరికరాలను ఉపయోగించడంపై శిక్షణ పొంది ఉండాలి.
ఇతర భద్రతా అంశాలు
అత్యవసర పరిస్థితుల్లో (ముఖ్యంగా అగ్నిప్రమాదం లేదా బస్సు నీటిలో పడినప్పుడు) కిటికీల అద్దాలు పగలగొట్టి బయటపడేందుకు ఉపయోగపడే సేఫ్టీ హ్యామర్‌లు బస్సులో కనీసం 4-6 చోట్ల ఏర్పాటు చేయాలి.
స్లీపర్ బెర్త్‌ల్లో ఇవి లేకపోయినా సీటింగ్ విధానం ఉన్న బస్సుల్లో కచ్చితంగా సీట్ బెల్ట్‌లు ఉండాలి.
ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌ను, ఇతరులను అప్రమత్తం చేయడానికి ఉపయోగించే అత్యవసర బటన్ ఉండాలి.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు కూడా మార్గాలు కనిపించేలా అత్యవసర లైటింగ్ వ్యవస్థ ఉండాలి.
భద్రతా వ్యవస్థలను ఉపయోగించే విధానం
అగ్నిప్రమాదం సంభవించినప్పుడు మొదట డ్రైవర్‌ను, తోటి ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేయాలి. అత్యవసర బటన్‌ను నొక్కాలి. అగ్ని ప్రమాద సమయంలో దగ్గరలో ఉన్న ఫైర్ ఎక్స్‌టింగ్యుషర్‌ను ఉపయోగించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాలి. మంటలు అదుపు తప్పితే వెంటనే బయటకు వెళ్లాలి. ప్రమాద సమయాల్లో అత్యవసర ద్వారాలు లేదా కిటికీలు (సేఫ్టీ హ్యామర్‌తో పగలగొట్టి) ద్వారా బయటకు రావాలి.
బస్సు నుంచి బయటకు వచ్చిన తర్వాత గాయాలు తగిలిన వారికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఉన్న యాంటీసెప్టిక్ ద్రవంతో శుభ్రం చేసి, బ్యాండేజీ వేయాలి. ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే శుభ్రమైన గుడ్డ లేదా ప్యాడ్‌తో గాయంపై గట్టిగా నొక్కి పట్టుకోవాలి. వీలైనంత త్వరగా వైద్య సాయం అందేలా చూడాలి.
ఇదీ చదవండి: భారత్‌లో సొంతింటి కోసం తంటాలు.. కానీ చైనాలో..


