అంతర్జాతీయ వాణిజ్యంలో సమానత్వం అవసరమని, ఒకే రకమైన పరిస్థితుల్లో ఉన్న దేశాలకు వేర్వేరు నిబంధనలు వర్తింపజేయడం అన్యాయమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. రష్యా చమురు విషయంలో భారత్‌పైనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తుండడం గురించి ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో భారత్ ఏకాకిగా మారిందంటూ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ద్వైపాక్షిక్ష చర్చల్లో భాగంగా జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన బెర్లిన్‌లో జరిగిన ఓ కార్యక్రమాంలో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు పేపర్‌లో చూశాను. ముడి చమురు కొనుగోలు విషయంలో ఆంక్షల నుంచి మిహాయించాలని జర్మనీ కోరినట్టు అందులో ఉంది. యూకే ఇప్పటికే అమెరికా నుంచి చమురు కొనుగోలు పరంగా మినహాయింపు పొందింది. అలాంటప్పుడు భారత్‌నే ఎందుకు లక్ష్యం చేసుకుంటున్నారు?.. అని మంత్రి అన్నారాయన.
ఇదిలా ఉంటే.. రష్యా చమురు కంపెనీలైన రోజ్‌నెఫ్ట్, ల్యూక్ ఆయిల్‌తో ఎవరూ వ్యాపార లావాదేవీలు నిర్వహించరాదంటూ ఈ నెల 22న అమెరికా ఆంక్షలు ప్రకటించింది. అయితే ఈ తరహా సుంకాలు అనుచితం, అన్యాయం, అసమంజసమని భారత్ తరఫున గోయల్ మరోసారి స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాతో భారత్ జరిపే చమురు వాణిజ్యం వల్లే నిధులు సమకూరుతున్నాయని.. తక్షణమే ఆ కొనుగోళ్లను ఆపేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పెనాల్టీ టారిఫ్‌లు విధించిన ఆయన.. ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ వచ్చారు. అయినప్పటికీ భారత్ మాత్రం జాతి ప్రయోజనాలు తప్పించి.. మరే ఇతర కోణంలోనూ నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టం చేసింది. అయితే..
మోదీ తనకు మంచి మిత్రుడని, రష్యా కొనుగోళ్లను ఆపేస్తానని హామీ ఇచ్చారని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారత్ ఈ ప్రకటనను ఖండించింది. ఆ వెంటనే ఆయన స్వరం మారింది. వైట్‌హౌజ్ దీపావళి వేడుకల్లో మాట్లాడుతూ.. భారీగా కొనుగోళ్లను జరపబోదంటూ మరో ప్రకటన చేసేశారు. అదే సమయంలో.. ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కూడా ఓ కొలిక్కి రాబోతోందని తెలిపారు. రష్యా నుంచి ముడి చమురును నిలిపివేయాలంటూ అమెరికా ఒత్తిళ్లు తీసుకువస్తున్న వేళ.. మంత్రి పీయూష్ గోయల్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది.


