
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రయివేటు టీవీ ఛానళ్లకు తీపి కబురు చెప్పింది. మొన్న వార్తాపత్రికలకు ఇచ్చే ప్రకటనల రేట్లను పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రైవేట్ టీవీ ఛానళ్లకు ఇచ్చే ప్రకటన రేట్లను పెంచింది.
ప్రయివేటు టీవీ చానెళ్లకు అందించే ప్రకటనల రేట్ల సవరణకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అంగీకరించిందని బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్ కమ్యూనికేషన్(బీవోసీ) ప్రకటించింది. 11శాతం పెంచుతూ శుక్రవారం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. దేశీయంగా వారి ప్రదర్శన, రేటింగ్స్ ఆధారంగా న్యూస్, నాన్-న్యూస్ ఛానళ్లకు వైవిధ్యమైన రేట్లు అమల్లో ఉంటాయని తెలిపింది. మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సమీక్ష కమిటీ జనవరి 1, 2019న అందించిన నివేదిక ఆధారంగా ఈ రేట్లను సవరించినట్టు పేర్కొంది.
కాగా ఇటీవల వార్తాపత్రికల కిచ్చే ప్రకటన రేట్లను 25శాతం పెంచుతూ బీవోసీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.