
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ కార్ల ధరలను పెంచుతోంది. అన్ని మోడళ్ల ధరలను రూ.30,000 వరకూ పెంచుతున్నామని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. పెరిగిన ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను కొంతవరకైనా తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని వివరించింది. ఈ కంపెనీ రూ.3.89 లక్షల నుంచి రూ.26.84 లక్షల రేంజ్‌లో ధరలుండే శాంత్రో హ్యాచ్‌బాక్ నుంచి ఎస్‌యూవీ ట్యూసన్ వరకూ వివిధ రకాల మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. కమోడిటీల ధరలు పెరగడం, విదేశీ మారక ద్రవ్య రేట్లలో ఒడిదుడుకుల కారణంగా ఇప్పటికే చాలా కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా, నిస్సాన్ ఇండియా, మారుతీ సుజుకీ, టయోటా, బీఎమ్‌డబ్ల్యూ, రెనో, ఇసుజు కంపెనీలు ధరలను పెంచనున్నామని పేర్కొన్నాయి.