హెచ్‌యూఎల్‌ లాభం 1,038 కోట్లు | HUL Q3 net rises 7% to Rs 1038 cr on exceptional income | Sakshi
Sakshi News home page

హెచ్‌యూఎల్‌ లాభం 1,038 కోట్లు

Jan 24 2017 12:47 AM | Updated on Sep 5 2017 1:55 AM

హెచ్‌యూఎల్‌ లాభం 1,038 కోట్లు

హెచ్‌యూఎల్‌ లాభం 1,038 కోట్లు

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యునిలివర్‌(హెచ్‌యూఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,038 కోట్ల నికర లాభం(స్టాండోలోన్‌) ఆర్జించింది.

క్యూ3లో 7 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యునిలివర్‌(హెచ్‌యూఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,038 కోట్ల నికర లాభం(స్టాండోలోన్‌) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.972 కోట్లు)తో పోల్చితే 7% వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌  తెలిపింది. అసాధారణ ఆదాయం అధికంగా ఉండటంతో  ఈ స్థాయి నికర లాభం వచ్చిందని హెచ్‌యూఎల్‌ చైర్మన్‌  హరీశ్‌ మన్వాని చెప్పారు. గత క్యూ3లో రూ.80 కోట్ల అసాధారణ వ్యయాలు ఉండగా, ఈ క్యూ3లో రూ.153 కోట్ల అసాధారణ ఆదాయం వచ్చిందన్నారు. మొత్తం ఆదాయం రూ.8,385 కోట్ల నుంచి 0.8% క్షీణించి రూ.8,318 కోట్లకు పడిపోయిందని పేర్కొన్నారు.

హోమ్‌ సెగ్మెంట్‌ రాబడులు 1 శాతం వృద్ధితో రూ.2,689 కోట్లకు,  రిఫ్రెష్‌మెంట్‌ సెగ్మెంట్‌ రాబడి స్వల్పంగా పెరిగి రూ.279 కోట్లకు, ఆహార పదార్థాల విభాగం రాబడి 8 శాతం వృద్ధితో రూ.1,164 కోట్లకు పెరిగాయని హరీశ్‌ చెప్పారు.  వ్యక్తిగత ఉత్పత్తుల ఆదాయం 3 శాతం తగ్గి రూ.3,980 కోట్లకు, ఎగుమతులు, నీరు. ఇన్‌ఫాంట్‌ కేర్‌ వ్యాపారాల రాబడులు 27% తగ్గి రూ.195 కోట్లకు తగ్గాయని వివరించారు.

మార్జిన్ల మెరుగుదలపై దృష్టి..
మార్కెట్‌ పుంజుకుంటున్న సమయంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు దెబ్బతీసిందని  హరీశ్‌ మన్వాని పేర్కొన్నారు. అయితే తాము ఈ ప్రభావాన్ని తట్టుకోగలిగామని వివరించారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తున్నాయని, మార్జిన్ల మెరుగుదలపై దృష్టిని కొనసాగిస్తున్నామని చెప్పారు. బీఎస్‌ఈలో హెచ్‌యూఎల్‌ షేర్‌ స్వల్పంగా తగ్గి రూ.863 వద్ద స్థిరపడింది.  మార్కెట్‌ ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement