పీఎన్‌బీని దాటిన ‘హౌసింగ్‌ ఫైనాన్స్‌’ 

Housing finance crosses PNB - Sakshi

రూ. 68 కోట్లు అధికంగా పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌ మార్కెట్‌ విలువ 

న్యూఢిల్లీ: నీరవ్‌ మోదీ కుంభకోణం దెబ్బ నుంచి బైటపడటానికి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నానా తంటాలు పడుతోంది. అయితే, దీని ప్రతికూల ప్రభావాలతో దాని మార్కెట్‌ విలువ గణనీయంగా హరించుకుపోయింది. అనుబంధ సంస్థ పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌) కన్నా మాతృ సంస్థ పీఎన్‌బీ మార్కెట్‌ క్యాప్‌ తగ్గిపోయింది. గురువారం మార్కెట్‌ ముగిసే సమయానికి పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌ మార్కెట్‌ వేల్యుయేషన్‌ రూ. 21,172 కోట్లు కాగా పీఎన్‌బీ విలువ రూ. 21,105 కోట్లకు చేరింది. మాతృసంస్థ కన్నా పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌ విలువ రూ. 68 కోట్లు అధికం కావడం గమనార్హం.

గురువారం బీఎస్‌ఈలో పీఎన్‌బీ షేరు 1.19 శాతం లాభంతో రూ. 76.45 వద్ద ముగియగా, పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌ షేరు 0.44 శాతం క్షీణించి రూ. 1,265 వద్ద క్లోజయ్యింది. పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌లో పీఎన్‌బీకి 32.96 శాతం వాటాలు ఉన్నాయి. స్కామ్‌ బైటపడకముందు ఫిబ్రవరిలో పీఎన్‌బీ మార్కెట్‌ క్యాప్‌ ప్రస్తుతమున్న దానికి రెట్టింపు స్థాయిలో రూ. 44,625 కోట్ల పైచిలుకు ఉండేది. అయితే, రూ. 14,000 కోట్ల నీరవ్‌ మోదీ కుంభకోణం వెలుగుచూసినప్పట్నుంచీ షేరు పతనమవుతూ వస్తోంది. ఇక నాలుగో త్రైమాసికంలో భారీ నష్టాలతో ఆర్థిక ఫలితాల కారణంగా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పీఎన్‌బీ స్టాక్‌ సుమారు 15 శాతం క్షీణించింది. ఈ నేపథ్యంలో పీఎన్‌బీ షేరు పెట్టుబడికి అంత అనువైనది కాకపోవచ్చంటూ ఎడెల్వీస్‌ రీసెర్చ్‌ ఒక నివేదికలో పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top