మరిన్ని ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు

GST On More Items To Be Slashed If Revenue Increases: Goyal - Sakshi

న్యూఢిల్లీ : అధిక పన్ను రేట్లతో సతమవుతున్న సామాన్యులకు జీఎస్టీ కౌన్సిల్‌ ఉపశమనమిస్తూ వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఉత్పత్తులపై పన్ను రేట్లను తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్‌, మరికొన్ని ఉత్పత్తులపై కూడా పన్ను రేట్లను తగ్గించబోతుందట. ఒకవేళ రెవెన్యూలు పెరిగితే, మరిన్ని ఉత్పత్తులపై కూడా జీఎస్టీ రేట్ల కోత ఉంటుందని ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. జీఎస్టీ చట్టాల గురించి లోక్‌సభలో మాట్లాడిన పీయూష్‌ గోయల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. పీయూష్‌ గోయల్‌ ప్రసంగానికి విపక్షాలు పలుమార్లు అడ్డుపడినప్పటికీ, మంత్రి తన స్పీచ్‌ను కొనసాగించారు. 

‘గత సమావేశాల్లో చాలా ఉత్పత్తులు, సర్వీసులపై జీఎస్టీ కౌన్సిల్‌ పన్ను రేట్లను తగ్గించింది. ఈ పరోక్ష పన్ను విధానం ద్వారా వినియోగదారులపై ఉన్న పన్ను భారాన్ని కాస్త తగ్గించాలనుకుంటున్నాం. గత ఏడాదిగా జీఎస్టీ కౌన్సిల్‌ 384 ఉత్పత్తులు, 68 సర్వీసులపై పన్ను రేట్లను తగ్గించింది. 186 ఉత్పత్తులు, 99 సర్వీసులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చింది. శానిటరీ ప్యాడ్స్‌ కూడా జీఎస్టీ మినహాయింపు పొందిన ఉత్పత్తుల్లో ఉన్నాయి’ అని పీయూష్‌ గోయల్‌ తెలిపారు. దేశీయ ఆర్థిక లోటుకు అనుగుణంగా జీఎస్టీని సేకరిస్తున్నామని చెప్పారు. అంచనావేసిన దానికంటే భారత వృద్ధి మెరుగ్గానే ఉందని ఆయన పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ విడుదల చేసిన రిపోర్టులో కూడా 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7.5 శాతంగా ఉంటుందని అంచనావేసింది. 

తన ప్రసంగం సమయంలో కాంగ్రెస్‌ చేసిన నిరసనలపై స్పందించిన పీయూష్‌ గోయల్‌, ‘మీ పార్టీని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. సభను నిర్వహించకుండా కాంగ్రెస్‌ నేతలు అంతరాయం సృష్టిస్తూనే ఉన్నారు. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్‌ నేతలు అంత సీరియస్‌గా లేరని తెలుస్తోంది. మీరు విఫలమైన వాటిని మోదీ పూరించారు. తర్వాత సాధారణ ఎన్నికల్లో మీకు 4 సీట్లు కూడా రావంటూ’  మండిపడ్డారు. అయితే జీఎస్టీ ఎలా అమలు చేయాలో కేంద్ర ప్రభుత్వానికి తెలియదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు. జీఎస్టీ అమలు సరిగ్గా లేకపోవడంతో, తమిళనాడులో 50వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శించారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top