జీఎస్‌టీ వసూళ్లు పడిపోయాయ్‌

GST Collection Has Dropped Below - Sakshi

సెప్టెంబర్‌లో రూ.91,916 కోట్లు

2018 ఇదే నెలలో రూ.94,442 కోట్లు

న్యూఢిల్లీ:వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు సెప్టెంబర్‌లో పెరక్కపోగా క్షీణతను నమోదుచేసుకున్నాయి.ఆగస్టుతో పోల్చితే ఈ మొత్తం రూ.98,202 కోట్ల నుంచి రూ.91,916 కోట్లకు తగ్గినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.  2018 సెప్టెంబర్‌తో పోల్చి చూసినా, తాజా సమీక్షా నెల్లో వసూళ్లు తగ్గడం గమనార్హం. అప్పట్లో ఆ మొత్తం రూ.94,442 కోట్లు. అంటే వార్షికంగా 2.67 శాతం తగ్గిందన్నమాట. జీఎస్‌టీ వసూళ్లు పెరక్కపోగా క్షీణతలోకి జారడం ఇది వరుసగా రెండవనెల.   మొత్తం వసూళ్లను విభాగాలుగా చూస్తే...
►సీజీఎస్‌టీ ఆదాయం: రూ. 16,630 కోట్లు
►ఎస్‌జీఎస్‌టీ ఆదాయం : రూ.22,598 కోట్లు
►ఐజీఎస్‌టీ ఆదాయం : రూ.45,069 కోట్లు (దిగుమతులపై వసూలయిన రూ.22,097 కోట్లు సహా)
►కాంపన్‌సేషన్‌ సెస్‌ : రూ.7,620 కోట్లు (దిగుమతులపై వసూళ్లయిన రూ.728 కోట్లు సహా)
►సెప్టెంబర్‌ 30వ తేదీ వరకూ చూస్తే, దాఖలైన జీఎస్‌టీఆర్‌ 3బీ రిటర్న్స్‌ (సమ్మరీ ఆఫ్‌ సెల్ఫ్‌ అసిస్డ్‌ రిటర్న్‌) సంఖ్య 75.94 లక్షలు.   
►తాజా పరిస్థితిని పరిశీలిస్తే, 2019–20లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తిలో 3.3 శాతానికి కట్టడి చేయడం కష్టమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంమీద (మార్చి వరకూ) ద్రవ్యలోటు రూ.7.03 లక్షల కోట్లకు కట్టడి చేయాలని 2019–20 బడ్జెట్‌ నిర్దేశించుకుంటే, ఆగస్టు  ముగిసే నాటికే 5,53,840 కోట్లకు (78 శాతానికి) చేరింది.  
►పండుగల సీజన్‌ కావడంతో అక్టోబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఆర్‌బీఐ రెపోరేటు కోత, డిమాండ్‌ పుంజుకోడానికి కేంద్రం    చర్యలు ఇందుకు మద్దతునిస్తాయని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top