వృద్ధి రేటు అంచనాలు కట్‌

Growth Rate Predictions Cut - Sakshi

కుదించిన  ఆర్థిక సేవల సంస్థలు

కోలుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం

రికవరీ బలహీనంగానే ఉండొచ్చని అంచనా

న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను ఆర్థిక సేవల సంస్థలు కుదించాయి. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ఫిచ్‌ సొల్యూషన్స్‌.. 6.8% నుంచి 6.4%కి తగ్గించగా, సింగపూర్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం డీబీఎస్‌ కూడా 6.8% నుంచి 6.2%కి కుదించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నమోదైన 5.4 శాతం కన్నా మరింత తక్కువగా ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 5%కి జీడీపీ వృద్ధి పడిపోయిన నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వృద్ధి మందగమనానికి దాదాపు అడ్డుకట్ట పడి ఉండొచ్చని.. రాబోయే త్రైమాసికాల్లో రికవరీ ప్రారంభం కావొచ్చని ఫిచ్‌ తెలిపింది. అయితే, అంతర్జాతీయంగాను, ప్రైవేట్‌ రంగంలో వినియోగపరమైన ఒత్తిళ్ల కారణంగా.. ఈ రికవరీ గతంలో కన్నా బలహీనంగా ఉండొచ్చని పేర్కొంది. ద్రవ్య, ఆర్థికపరమైన ఉద్దీపనలు, సంస్కరణల కొనసాగింపు, సానుకూల బేస్‌ ఎఫెక్ట్‌ మొదలైనవి వృద్ధి మెరుగుపడటానికి దోహదపడొచ్చని వివరించింది. ‘బడ్జెట్‌ ప్రతిపాదనలు, ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన చర్యలు.. వృద్ధికి ఊతమివ్వడానికి గానీ .. సెంటిమెంట్‌ను మెరుగుపర్చడానికి గానీ సరిపోయినంత స్థాయిలో లేవు. మరిన్ని మెరుగైన చర్యలు ఉండొచ్చని ఆశావహ అంచనాలు నెలకొన్నప్పటికీ.. అలాంటివేమీ లేకపోయే రిస్కులు కూడా ఉన్నాయి‘ అని ఫిచ్‌ తెలిపింది. ఆటోమొబైల్‌ అమ్మకాలు క్షీణించడంతో రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాలు పోవడం, నిర్మాణ రంగంలోనూ మందగమన పరిస్థితులు నెలకొనడం, వినియోగం తగ్గిపోవడం తదితర అంశాల కారణంగా వ్యాపార సంస్థలు పెట్టుబడి ప్రణాళికలను పక్కన పెట్టే అవకాశం ఉందని వివరించింది.

మరో విడత వడ్డీ రేట్ల కోత..
వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి వృద్ధి గతి కొంత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని డీబీఎస్‌ ఒక నివేదికలో పేర్కొంది. సుమారు 7 శాతం దాకా నమోదు చేయొచ్చని వివరించింది. అయితే, బలహీన జీడీపీ గణాంకాల కారణంగా అక్టోబర్‌లో జరిగే సమావేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక రేట్లను మరో 15–25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించవచ్చన్న గత అంచనాలకు కట్టుబడి ఉన్నట్లు డీబీఎస్‌ తెలిపింది. వృద్ధిపై ఆందోళన పెరిగే కొద్దీ రేట్ల కోత అవకాశాలు కూడా పెరుగుతున్నట్లు వివరించింది.   

ఇదే కనిష్ట స్థాయి కావొచ్చు..
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో నమోదైన వృద్ధే దాదాపు కనిష్ట స్థాయి కావొచ్చని, ఇకనుంచి కొంత కోలుకోవచ్చని అంతర్జాతీయ బ్యాంకింగ్‌ దిగ్గజం యూబీఎస్‌ అభిప్రాయపడింది. ఆర్థిక మందగమనం కారణంగా డిమాండ్, పెట్టుబడులు, ఎగుమతుల అంచనాలు.. అన్నీ దెబ్బతిన్నాయని వివరించింది. భవిష్యత్‌ రికవరీ ప్రక్రియ చాలా సుదీర్ఘంగాను, మార్కెట్‌ అంచనాల కన్నా దిగువ స్థాయిలోనే ఉండవచ్చని యూబీఎస్‌ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top