పట్టాలెక్కిన రియల్టీ!

Growth in openings and sales in the country in 2018 Queue 1 - Sakshi

దేశంలో 2018 క్యూ1లో ప్రారంభాలు, విక్రయాల్లోనూ వృద్ధి 

33,300 ఫ్లాట్లు లాంచింగ్‌; అందుబాటు గృహాలు 26,800

12 శాతం వృద్ధితో 49,200 ఫ్లాట్ల అమ్మకాలు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2018 క్యూ1లో ప్రారంభమైన గృహాల్లో 74 శాతం అందుబాటు గృహాలే. 24,600 గృహాలు రూ.80 లక్షల లోపు ధరవేనని అన్‌రాక్‌ ప్రాపర్టీస్‌ కన్సల్టింగ్‌ నివేదిక తెలిపింది. వేగవంతమైన అనుమతులు, విధానపరమైన నిర్ణయాలతో రియల్టీ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొందని  అన్‌రాక్‌ చైర్మన్‌ అనూజ్‌ పురీ తెలిపారు. కొత్త విధానాలతో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ పెరిగిందని చెప్పారు. విక్రయించబడకుండా ఉన్న ఇన్వెంటరీ గణాంకాల్లోనూ 2 శాతం తగ్గుదల నమోదైంది. 2017 క్యూ4లో 7.11 లక్షల ఇన్వెంటరీ ఉండగా.. 2018 క్యూ1 నాటికవి 7.27 లక్షల యూనిట్లకు తగ్గాయి. 

ముంబై మినహా ఇతర నగరాల్లో వృద్ధి.. 
కొత్త యూనిట్ల ప్రారంభాల్లో ముంబై మినహా మిగిలిన అన్ని నగరాల్లోనూ వృద్ధి నమోదైంది. ముంబైలో క్యూ4లో 11,500 యూనిట్లు ప్రారంభమైతే.. క్యూ1 నాటికవి 25 శాతం తగ్గుదలతో 8,600లకు పడిపోయాయి. కోల్‌కతాలో క్యూ4లో 1,600 యూనిట్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 306 శాతం వృద్ధితో 6,500 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇందులో 3,500 యూనిట్లు అందుబాటు గృహాలే. బెంగళూరులో 3,000 యూనిట్ల నుంచి 127 శాతం వృద్ధితో 6,800 యూనిట్లకు పెరిగాయి. చెన్నైలో 1,000 యూనిట్ల నుంచి 110 శాతం వృద్ధితో 2,100 యూనిట్లు, ఎన్‌సీఆర్‌లో 3,800 యూనిట్ల నుంచి  14 శాతం వృద్ధితో 4,500 యూనిట్లుకు, పుణెలో 1,700 యూనిట్ల నుంచి 7 శాతం వృద్ధితో 2,200 యూనిట్లకు పెరిగాయి. 

చెన్నై మినహా ఇతర నగరాల్లో వృద్ధి.. 
2018 క్యూ1 అమ్మకాల్లో చెన్నై మినహా అన్ని నగరాల్లోనూ వృద్ధి కనిపించింది. ఇక్కడ క్యూ4లో 2,600 యూనిట్లు విక్రయం కాగా.. క్యూ1లో 2,300లకు తగ్గాయి. కోల్‌కతాలో క్యూ4లో 2,400 యూనిట్లు అమ్ముడుపోగా.. క్యూ1 నాటికి 42 శాతం వృద్ధితో 3,400లకు పెరిగింది. బెంగళూరులో 10 వేల యూనిట్ల నుంచి 15% వృద్ధితో 11,500లకు, ఎన్‌సీఆర్‌లో 8,200 యూనిట్ల నుంచి 11 శాతం వృద్ధితో 9,100లకు, ముంబైలో 11 వేల నుంచి 12 శాతం వృద్ధితో 12,300లకు, పుణెలో 5,900ల నుంచి 15 శాతం వృద్ధితో 6,800ల యూనిట్లకు పెరిగాయి.   

నగరంలో 30% తగ్గిన ప్రారంభాలు.. 
దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో 2018 క్యూ1లో 33,300 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇందులో 66 శాతం యూనిట్లు కేవలం ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. హైదరాబాద్‌లో కొత్త నివాసాల ప్రారంభాల్లో 30 శాతం తగ్గుదల నమోదైంది. 2017 క్యూ4లో నగరంలో 3,700 గృహాలు ప్రారంభం కాగా.. 2018 క్యూ1 నాటికి 30 శాతం తగ్గుదలతో 2,600 యూనిట్లే ప్రారంభమయ్యాయి. 

నగరంలో 3% పెరిగిన విక్రయాలు..
2018 క్యూ1లో 49,200 యూనిట్లు అమ్ముడుపోగా.. ఇందులో 80 శాతం యూనిట్లు కేవలం ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, పుణే నగరాల్లోనే జరిగాయి. హైదరాబాద్‌లో అమ్మకాల్లో 3 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది క్యూ4లో నగరంలో 3,700 అమ్మడుపోగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 3,800లకు పెరిగింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top