గ్యాస్‌ వివాదాలపై నిపుణుల కమిటీ

Government constitutes expert panel to resolve oil, gas disputes - Sakshi

సత్వర పరిష్కార మార్గాలపై కేంద్రం దృష్టి

న్యూఢిల్లీ: చమురు, గ్యాస్‌ రంగాల్లో పెట్టుబడులపై వివాదాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. సుదీర్ఘ న్యాయపోరు సమస్యలు లేకుండా నిర్దిష్ట కాలవ్యవధిలోగా ఇంధనాల అన్వేషణ, ఉత్పత్తి సంబంధ వివాదాల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించింది. ఇందులో చమురు శాఖ మాజీ కార్యదర్శి జీసీ చతుర్వేది, ఆయిల్‌ ఇండియా మాజీ సీఎండీ బికాష్‌ సి బోరా, హిందాల్కో ఇండస్ట్రీస్‌ ఎండీ సతీష్‌ పాయ్‌ సభ్యులుగా ఉంటారని కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

కమిటీ కాల వ్యవధి మూడేళ్ల పాటు ఉంటుంది. వివాదాలను కనిష్టంగా మూడు నెలల్లో పరిష్కరించే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం ద్వారా భాగస్వాముల మధ్య లేదా కాంట్రాక్టరు.. ప్రభుత్వం మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడంపై ఈ కమిటీ దృష్టి పెడుతుంది. ఇందుకోసం థర్డ్‌ పార్టీ సర్వీసులను కూడా తీసుకోవచ్చు. ఆర్బిట్రేషన్‌ కోసం నిపుణుల కమిటీని ఆశ్రయించిన తర్వాత.. మళ్లీ ప్రత్యేకంగా కోర్టుకు వెళ్లడానికి కుదరదు. అయితే, పరస్పర అంగీకారంతో సమస్య పరిష్కార ప్రక్రియ వ్యవధిని పెంచుకోవచ్చు. నిర్దిష్టంగా చట్టపరమైన అంశాలు ఉంటే తప్ప ఆయా సంస్థల ఉద్యోగులు, ఉన్నతాధికారులే.. కమిటీ ముందు వాదనలు వినిపించవచ్చు. అడ్వొకేట్లు, కన్సల్టెంట్ల పాత్రేమీ ఇందులో ఉండదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top