
ఎస్‌పీ గ్రూప్ చైర్మన్ షాపూర్‌జీ పల్లోంజీ మిస్త్రీ పునరుద్ఘాటన
న్యూఢిల్లీ: టాటా ట్రస్ట్స్ ట్రస్టీల మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో, టాటా సన్స్‌ను స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయాలన్న డిమాండ్‌ను ఎస్‌పీ గ్రూప్ చైర్మన్ షాపూర్‌జీ పల్లోంజీ మిస్త్రీ పునరుద్ఘాటించారు. సంస్థ లిస్టింగ్‌తోనే వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటా కోరుకున్న పారదర్శకత సాధ్యపడుతుందని, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, ప్రజల్లో నమ్మకం కూడా పెరుగుతుందని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. టాటా సన్స్‌ను లిస్టింగ్ చేయాలంటూ తాము ఎప్పటినుంచో కోరుతున్నామని వివరించారు.
ఈ నేపథ్యంలో టాటా సన్స్‌ను అప్పర్ లేయర్ సంస్థగా లిస్ట్ చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ విధించిన గడువును సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఘనమైన వారసత్వాన్ని నిలబెట్టుకునేందుకు, భవిష్యత్తులో ముందుకు సాగేందుకు పారదర్శకత అత్యంత కీలకమనేది తమ నమ్మకమని మిస్త్రీ వివరించారు.
ఆర్‌బీఐ ఒక రాజ్యాంగబద్ధమైన, స్వతంత్ర సంస్థగా సమానత్వం, న్యాయం, ప్రజాప్రయోజన సూత్రాలను నిలబెట్టే నిర్ణయాలు తీసుకుంటుందని తాము విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టాటా సన్స్ పబ్లిక్ లిస్టింగ్ కేవలం ఆర్థికపరమైనదే కాకుండా నైతిక, సామాజిక బాధ్యతని మిస్త్రీ తెలిపారు. టాటా గ్రూప్ ప్రమోటర్, హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబానికి 18.37 శాతం, టాటా ట్రస్ట్స్‌కి 66 శాతం వాటాలు ఉన్నాయి. టాటా సన్స్‌లో వాటాలను వినియోగించుకుని, రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఎస్‌పీ గ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది.
ప్రశాంతంగా టాటా ట్రస్ట్స్ బోర్డు సమావేశం
ట్రస్టీల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో శుక్రవారం టాటా ట్రస్ట్స్ బోర్డు భేటీ అయ్యింది. అయితే, ఇందులో వివాదాస్పద అంశాల ప్రస్తావనేమీ రాలేదని, సమావేశం సజావుగానే సాగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాతృత్వ కార్యకలాపాలు, ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులకు నిధులు తదితర అంశాలను సమీక్షించినట్లు పేర్కొన్నాయి. బోర్డులో నియామకాలు, గవర్నెన్స్ అంశాలపై టాటా ట్రస్ట్స్ ట్రస్టీల మధ్య విభేదాలు నెలకొనడం, చైర్మన్ నోయల్ టాటా తదితరులు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో భేటీ కావడం తెలిసిందే.