కోవిడ్‌ భయం.. పసిడి పరుగు!

Gold price so high On Covid effect - Sakshi

అంతర్జాతీయంగా ఏడేళ్ల గరిష్ట స్థాయి...

ఔన్స్‌ 1,614 డాలర్లపైకి అప్‌

న్యూయార్క్‌: చైనాలో మొదలై ప్రపంచాన్ని భయపెడుతున్న కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌... ఇన్వెస్టర్లను బంగారంవైపు తిరిగేలా చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పెట్టుబడులకు బంగారమే సురక్షిత మార్గమని వారు భావిస్తున్నారు. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌– నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర బుధవారం ట్రేడింగ్‌ ఒక దశలో 1,614.25 డాలర్లను తాకింది. ఇది ఏడేళ్ల కనిష్టస్థాయి. ఈ వార్త రాసే 10 గంటల సమయంలో 1,607 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కరోనా భయాలతో ప్రపంచ వృద్ధిరేటు పడిపోయే పరిస్థితి ఉందని, ఈ పరిస్థితులను ఎదుర్కొనడానికి పలు ఆర్థిక వ్యవస్థలు ఉద్దీపన చర్యలు చేపడతాయని వస్తున్న వార్తలు కూడా పసిడికి బలంగా మారుతున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే, ఏడాదిలో పసిడి ధర 21 శాతం (1,277.9 డాలర్లు కనిష్టం) పెరిగింది.  

దేశీయంగానూ జోరు...
ఇక అంతర్జాతీయ ధోరణికి తోడు, పెళ్లిళ్ల సీజన్‌ దేశంలో పసిడి ధరను పెంచుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీన ధోరణి కూడా పసిడికి బలమవుతోంది. ఈ వార్తరాసే సమయానికి దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌)లో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర లాభాల్లో రూ.41,470 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీ స్పాట్‌ మార్కెట్‌లో ఈ మెటల్‌ ధర రూ.462 ఎగసి రూ.42,339కు ఎగసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top