పసిడి@1800 డాలర్లు- 8 ఏళ్ల గరిష్టం | Gold price crosses 1800 dollars | Sakshi
Sakshi News home page

8 ఏళ్ల తదుపరి 1800 డాలర్లకు పసిడి

Jul 9 2020 9:53 AM | Updated on Jul 9 2020 11:16 AM

Gold price crosses 1800 dollars  - Sakshi

కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలన్నిటా కోరలు చాస్తున్న కరోనా వైరస్‌ ఇటీవల మరింత విస్తరిస్తుండటంతో బంగారానికి డిమాండ్‌ కొనసాగుతోంది. వెరసి విదేశీ మార్కెట్లో ఔన్స్‌(31.1 గ్రాములు) 1800 డాలర్లను అధిగమించింది. ఇది 2011 తదుపరి అత్యధికంకాగా.. దేశీయంగానూ పసిడి బలపడింది. 10 గ్రాముల ధర రూ. 48,450 నుంచి రూ. 48,700కు ఎగసింది. ఈ బాటలో కేజీ వెండి ధర రూ. 49,200 నుంచి రూ. 50,020కు బలపడింది. కేంద్ర బ్యాంకులతోపాటు.. సామాన్య ప్రజలవరకూ సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక పెట్టుబడిగా పసిడిని భావిస్తుండటమే దీనికి కారణమని బులియన్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

వివిధ మార్కెట్లలో
దేశీయంగా ఎక్సయిజ్‌ డ్యూటీ, రాష్ట్ర పన్నులు, తయారీ చార్జీల కారణంగా వివిధ మార్కెట్లో విభిన్న ధరలు పలుకుతుంటాయని బులియన్‌ వర్గాలు చెబుతున్నాయి. వెరసి ఢిల్లీ మార్కెట్లో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,500కు చేరగా.. చెన్నైలో రూ. 46,780ను తాకింది. ఇక ముంబైలో రూ. 46,600 వద్దకు చేరింది. గోల్డ్‌ రిటర్న్స్‌ వివరాల ప్రకారం చెన్నై మార్కెట్లో 24 క్యారట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 50,990ను తాకింది. 

ఎంసీఎక్స్‌లో
ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌లో అంటే ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం ఆగస్ట్‌ గోల్డ్‌ 0.75 శాతం పుంజుకుని 10 గ్రాములు రూ. 49,165కు చేరింది. ఇదే విధంగా వెండి కేజీ జులై ఫ్యూచర్స్‌ రూ. 51,594ను తాకింది. బుధవారం పసిడి ఫ్యూచర్స్‌ రూ. 49,045 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి(ఫ్యూచర్స్‌) 1821 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ ధర 1811 డాలర్ల వద్ద ఉంది. వెండి ఔన్స్‌ 19.22 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కాగా.. దేశీ రిఫైనరీలలో శుద్ధి చేసిన పసిడి బార్లను అనుమతించనున్నట్లు ఎంసీఎక్స్‌ తాజాగా పేర్కొంది. అయితే ఇందుకు నియంత్రణ సంస్థలు అనుమతించవలసి ఉన్నట్లు తెలియజేసింది. మరోపక్క గోల్డ్‌ మినీ ఆప్షన్స్‌(100 గ్రాములు)ను ప్రవేశపెట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించినట్లు పేర్కొంది. అమెరికాలోని పలు రాష్ట్రాలలో కోవిడ్‌(సెకండ్‌ వేవ్‌) విస్తరిస్తుండటంతో ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి సహాయక ప్యాకేజీల రూపకల్పనకు ఉపక్రమించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో పసిడికి డిమాండ్‌ పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement