భారీ లాభాల్లో ప్రపంచ మార్కెట్లు

Global Stock Markets profits hiked - Sakshi

హాంకాంగ్‌/న్యూయార్క్‌: కొన్ని దేశాల్లో ‘కరోనా’ మరణాలు తగ్గడంతో సోమవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. కరోనా హాట్‌స్పాట్‌ దేశాలైన ఇటలీ, స్పెయిన్‌ల్లో కొత్త కేసులు తగ్గడం సానుకూల ప్రభావం చూపించింది. ఆసియా మార్కెట్లు 2–4 శాతం, యూరప్‌ మార్కెట్లు 3–6 శాతం లాభపడగా, రాత్రి గం. 11.30 ని.లకు అమెరికా స్టాక్‌ సూచీలు 5–6 శాతం రేంజ్‌ లాభాల్లో  ట్రేడవుతున్నాయి. మహావీర్‌ జయంతి సందర్భంగా సోమవారం మన మార్కెట్‌ పనిచేయలేదు. ఒకవేళ మన స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడింగ్‌ జరిగి ఉంటే, సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 3 శాతం లాభపడి ఉండేవని నిపుణులంటున్నారు.  

ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాటికి కరోనా కేసులు 12 లక్షలకు, మరణాలు 70,000కు పెరిగాయి. అయితే కొన్ని యూరప్‌ దేశాల్లో మరణాలు అంతకు ముందటి రోజుల కంటే తగ్గడంతో ప్రపంచ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఇటలీలో రెండు వారాల్లో కనిష్ట మరణాలు ఆదివారమే నమోదయ్యాయి. మరోవైపు స్పెయిన్‌లో మరణాల సంఖ్య వరుసగా మూడో రోజూ తగ్గింది. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గింది. ఇక అమెరికాలో కేసుల సంఖ్య నిలకడ స్థాయికి చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించడం కలసి వచ్చింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి ప్రతిరూపమైన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం మొదటి సెషన్‌లో 4 శాతం లాభపడగా, రెండో సెషన్‌లో 1 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో నేడు (మంగళవారం) సెన్సెక్స్, నిఫ్టీలు భారీ గ్యాప్‌ అప్‌తో మొదలవుతాయని అంచనా. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top