క్యూ2లో జీడీపీ స్మార్ట్‌ రికవరీ!- ఎస్‌బీఐ రీసెర్చ్‌

GDP may recover smartly in Q2: SBI Research - Sakshi

క్యూ1లో జీడీపీకి షాక్‌ 

ఏప్రిల్‌-జూన్‌లో 40 శాతం క్షీణత

క్యూ3లోనూ ఆర్థిక పురోగతి

ఏడాది చివర్లో మరో ప్యాకేజీ!

ఎస్‌బీఐ రీసెర్చ్‌ తాజా అంచనాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థకు కోవిడ్‌-19 కారణంగా షాక్‌తగలనున్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ తాజాగా అంచనా వేసింది. క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో దేశ జీడీపీ ఏకంగా 40 శాతం క్షీణించనున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. అయితే ఈ ఏడాది రెండో క్వార్టర్‌(జులై- సెప్టెంబర్‌) నుంచీ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకునే వీలున్నట్లు పేర్కొంది. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.8 శాతం వెనకడుగు వేసే చాన్స్‌ ఉన్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌అంచనా కట్టింది. తొలి క్వార్టర్‌లో జీడీపీ 40 శాతానికి మించి క్షీణించే వీలున్నట్లు చెబుతోంది. క్యూ2లో 7.1 శాతం బౌన్స్‌బ్యాక్‌ కానున్నట్లు అభిప్రాయపడింది. ఈ బాటలో ద్వితీయార్ధంలోనూ ఆర్థిక వ్యవస్థ బలపడే వీలున్నట్లు తెలియజేసింది.

చివర్లో స్టిములస్‌ 
ఈ ఏడాది చివర్లో ప్రభుత్వం నుంచి మరో సహాయక ప్యాకేజీ వెలువడే అవకాశమున్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా వేస్తోంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే వీలున్నట్లు పేర్కొంది. కాగా.. ఈ ఏడాది క్యూ1లో జీడీపీ 25 శాతం నీరసించవచ్చని రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ అంచనా వేసింది. దేశం తొలిసారి తీవ్ర మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. వెరసి ఈ ఏడాది దేశ జీడీపీ 5 శాతం క్షీణించనున్నట్లు అభిప్రాయపడింది. ఇప్పటికే విదేశీ దిగ్గజం ఫిచ్‌ రేటింగ్స్‌.. ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ ప్రతికూల(మైనస్‌) వృద్ధిని చవిచూడనున్నట్లు అంచనా వేసింది. దీంతో ముందుగా వేసిన 0.8 శాతం వృద్ధి అంచనాలను మైనస్‌ 5 శాతానికి సవరిస్తున్నట్లు తెలియజేసింది. దేశానికి స్వాతంత్ర్యం లభించాక నాలుగోసారి మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు క్రిసిల్‌ వివరించింది. ఆర్థిక వ్యవస్థకు స్వేచ్చ కల్పించాక తొలిసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తినట్లు తెలియజేసింది. అయితే క్యూ1లో తీవ్ర మాంద్య పరిస్థితులు కనిపించనున్నట్లు పేర్కొంది.

చివరి వారంలో
జూన్‌ చివరి వారంలో దేశీయంగా కోవిడ్‌-19 కేసులు చివరి దశకు చేరుకోవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా వేస్తోంది. క్యూ3, క్యూ4లో పరిస్థితులను గమనించాక ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రభుత్వం మరోసారి సహాయక ప్యాకేజీకి రూపకల్పన చేసే అవసరం ఏర్పడవచ్చని భావిస్తున్నట్లు ఎస్‌బీఐ గ్రూప్‌ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ పేర్కొన్నారు. కాగా.. కోవిడ్‌-19 ప్రభావంతో రాష్ట్రాలకు రూ. 30 లక్షల కోట్లకుపైగా నష్టం వాటిల్లవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా వేసింది. 90 శాతం నష్టాలు రెడ్‌, ఆరెంజ్‌ జోన్లనుంచే నమోదుకావచ్చని తెలియజేసింది. రాష్ట్రాలవారీగా చూస్తే 15.6 శాతం వాటాతో మహారాష్ట్ర అత్యధికంగా నష్టపోనున్నట్లు పేర్కొంది. ఈ బాటలో తమిళనాడు 9.4 శాతం, గుజరాత్‌ 8.6 శాతం చొప్పున నష్టపోయే వీలున్నట్లు అంచనా వేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top