స్టార్టప్స్‌కు నిధుల దీపావళి!

స్టార్టప్స్‌కు నిధుల దీపావళి!


వ్యక్తిగత పెట్టుబడులతో కార్పొరేట్ దిగ్గజాల పోటాపోటీ



 గ్రూపులుగా ఏర్పడి మరీ ఇన్వెస్ట్‌మెంట్లు     దేశంలో తొలిసారి మహిళా స్టార్టప్స్‌కు ప్రత్యేక ఫండ్

 సాహా ఫండ్ పేరుతో రూ.100 కోట్ల నిధి...   హైదరాబాద్‌లో జోరుగా  ఫండింగ్



 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అప్పుడే కాలేజీ నుంచి బయటికొచ్చిన కుర్రాడి నుంచి... కోట్ల రూపాయల టర్నోవరున్న కార్పొరేట్ దిగ్గజాల వరకూ ప్రతి ఒక్కరూ కామన్‌గా జపిస్తున్న మంత్రం ‘స్టార్టప్’!  వినూత్న ఆలోచనలతో రంగంలోకి దిగుతున్న యువత ఓ పక్కనుం టే.. అలాంటి కంపెనీల్లో పెట్టుబడులకు పోటీ పడుతున్న కార్పొరేట్ దిగ్గజాలు మరోపక్కనున్నాయి. ఇంకా చెప్పాలంటే స్టార్టప్స్ పాలిట ఏంజెల్ ఇన్వెస్టర్స్.. పారిశ్రామిక దిగ్గజాలే!!

 

 నాలుగైదేళ్ల కిందటిదాకా స్టాక్ మార్కెట్లు, ఆర్థిక సాధనాల్లో మినహా కంపెనీల్లో వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చేవారు తక్కువే ఉండేవారు. ఇక హైదరాబాద్, బెంగళూరుకు చెందిన స్టార్టప్స్‌లో పెట్టుబడులంటే రెండు, మూడో శ్రేణి ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. కొందరు వ్యక్తిగతంగానే కాక... గ్రూపులుగా ఏర్పడి, వెంచర్ ఫండ్లు ఏర్పాటు చేసి మరీ పెట్టుబడులు పెడుతున్నట్లు లీడ్ ఏంజెల్స్ నెట్‌వర్క్ వైస్ ప్రెసిడెంట్, సౌత్ ఇండియా హెడ్ వినుత రాళ్లపల్లి చెప్పారు. దీనికి తోడు దేశంలో స్టార్టప్స్‌లను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం కూడా పారిశ్రామిక దిగ్గజాలు, సంపన్నుల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు.

 రతన్ టాటాతో మొదలు...

 

 స్టార్టప్స్‌లో వ్యక్తిగత పెట్టుబడుల విషయానికొస్తే ముందుగా చెప్పాల్సిన పేరు టాటా సన్స్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటాదే. రతన్‌టాటా 2014 నుంచి స్టార్టప్ కంపెనీల్లో వ్యక్తిగత పెట్టుబడులు మొదలెట్టారు. హోలా షెఫ్, అర్బన్ ల్యాడర్, కార్‌దేఖో, స్నాప్‌డీల్, బ్లూస్టోన్ ఓలా క్యాబ్స్ వంటి అన్ని రంగాల్లోని సుమారు 20కి పైగా స్టార్టప్స్‌లో టాటా పెట్టుబడులున్నాయి. నిజానికి రతన్ టాటా పెట్టుబడి పెట్టారంటే ఆ కంపెనీకి అదెంతో బలం. వాటి వ్యాపారంపై విశ్వాసం ఉండటం వల్లే రతన్ లాంటి వాళ్లు పెట్టుబడి పెట్టారని ఇతరులు కూడా ముందుకొస్తారనేది నిపుణులు అభిప్రాయం. ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్ రాజన్ ఆనందన్ ఇప్పటికి 29 కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు. సునీల్ కర్లా 16, అనుపమ్ మిట్టల్ 15, రాజేష్ సాహ్ని 13, అరిహంత్ పట్ని 12, కునాల్ బహల్ 12, రోహిత్ కుమార్ బన్సాల్ 12 కంపెనీల్లో ఇన్వెస్ట్‌చేశారు.

 

 వెంచర్ ఫండ్స్‌తో రంగంలోకి..

 స్టార్టప్ కంపెనీల్లో వ్యక్తిగత పెట్టుబడులే కాదు. ఒక గ్రూప్‌గా మారి, వెంచర్ ఫండ్లు ఏర్పాటు చేసి మరీ పెట్టుబడులు పెట్టడం ఈ మధ్య కాలంలో పెరిగింది. ఇప్పటికే విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్‌ఆర్ నారాయణమూర్తి సొంతంగా వెంచర్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలను ఏర్పాటు చేశారు. ప్రేమ్‌జీ కొడుకు రిషద్ ప్రేమ్ జీ సారథ్యంలో ‘ప్రేమ్ జీ ఇన్వెస్ట్’ పేరుతో మిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేసి టెక్నాలజీ ఆధారిత స్టార్టప్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ‘కాటామరాన్ వెంచర్స్’ పేరిట ఎన్‌ఆర్ నారాయణమూర్తి కూడా భారీగానే పెట్టుబుడులు పెడుతున్నారు.

 

  వీరి బాటలోనే రూ.100 కోట్ల నిధితో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వెంచర్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సొమ్మును టెక్ కంపెనీల్లో పెట్టుబడుల కోసం వినియోగిస్తారు. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన టాలెంట్ స్ప్రింట్ చైర్మన్ జేఏ చౌదరి, మరికొంత మంది పారిశ్రామికవేత్తలు కలిసి రూ.30 కోట్లతో స్టార్టప్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని బీవీఆర్ మోహన్‌రెడ్డి, జేఏ చౌదరి, శ్రీని కొప్పోలు, వంటి ఐటీ నిపుణులతో పాటు డి.సురేష్ బాబు, హరీష్ చంద్ర ప్రసాద్, శ్రీనిరాజు వంటి 65 మంది ప్రముఖులు కలిసి హైదరాబాద్ ఏంజిల్స్‌ను ఏర్పాటు చేశారు. 2012లో ప్రారంభమైన హైదరాబాద్ ఏంజెల్స్ ఇప్పటివరకు  12కు పైగా సంస్థల్లో రూ.15 కోట్ల పెట్టుబడులు పెట్టింది.  

 

     స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి బెంగళూరు ఐఐఎం పూర్వ విద్యార్థులు ఓ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఏడాదిలోగా మిలియన్ డాలర్ల నిధితో కనీసం 25 స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టాలనేది వీరి లక్ష్యం.

  మెదక్ జిల్లా సదాశివపేటలోని వాక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్... వాక్సెన్ ట్రేడ్ టవర్ పేరిట ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసింది. రూ.100 కోట్లతో స్టార్టప్ ఫండ్‌ను కేటాయించినట్లు సంస్థ సీఈఓ శ్రీకుమార్ సాంఘియా చెప్పారు.

 

  ‘సాహా ఫండ్’ మహిళా స్టార్టప్స్ కోసమే..

 మహిళా పారిశ్రామికవేత్తలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా కొందరు మహిళా పారిశ్రామికవేత్తలు జట్టు కట్టారు. రూ.100 కోట్ల నిధితో సాహా ఫండ్‌ను ఏర్పాటు చేసి... దానికి సెబీ అనుమతి కూడా సంపాదించారు. అసెంచురా ఇండియా మాజీ సీఎండీ అంకితా వశిష్ట స్థాపించిన సాహా ఫండ్‌లో అంకితా తండ్రి, అసెంచురా ఇండియా చైర్మన్ అవినాష్ వశిష్ట, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చైర్మన్ టీవీ మోహన్ దాస్, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షాలు సభ్యులుగా ఉన్నారు. సాహా ఫండ్‌నుంచి పెట్టుబడులు పొందాలంటే... సదరు స్టార్టప్‌ను మహిళలు స్థాపించి ఉండాలి. లేకపోతే ఆ సంస్థలో సీనియర్ మేనేజ్‌మెంట్‌గా మహిళ ఉండాలి. లేకుంటే కంపెనీలో సగానికి పైగా మహిళా ఉద్యోగులుండాలి. ఇవన్నీ కాకుంటే మహిళలు, పిల్లలకు సంబంధించిన ఉత్పత్తులను, సేవలందించే సంస్థైనా అయి ఉండాలి.

 ఇప్పటికే కొన్ని మిహ ళా స్టార్టప్స్ కంపెనీల్లో సాహా ఫండ్ పెట్టుబడులను పెట్టింది. 2013లో నిధీ అగర్వాల్ స్థాపించిన ఫ్యాషన్ పోర్టల్ సంస్థ కార్యా, నేషా మోత్వానీకి చెందిన పనిచేస్తున్న ఫిట్టర్‌నిటీ, అరుణా స్వరాజ్ ఫౌండర్‌గా ఉన్న క్లౌడ్ టెక్నాలజీ కంపెనీ స్టీలీ... వీటిలో సాహా పెట్టుబడులు పెట్టింది. ఈ మొత్తం రూ. 1.5-6 కోట్ల మధ్య ఉండొచ్చని సమాచారం.

 

 హైదరాబాద్‌లోనూ హల్‌చల్..

 3,100 పైగా స్టార్టప్స్‌తో ప్రపంచంలో ఇండియాది 4వ స్థానం. ఇందులో 8 శాతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఇక్కడి స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గంలో 60 వేల చ.అ. విస్తీర్ణంలో టీ-హబ్‌ను ప్రారంభించింది. 800 కంపెనీలు తమ ఉత్పత్తులను అభివృద్ధి చేసుకునేందుకు వీలు కల్పించే ఈ టీ-హబ్‌లో... కంపెనీలకు నిధులందించేందుకు రూ.10 కోట్ల నిధిని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో దీన్ని రూ.600 కోట్లకు పెంచనుంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి ఈ నిధికి రూ.90 కోట్ల వరకూ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.  


 ట్రిపుల్ ఐటీ-సీఐఈ సీడ్ ఫండ్ ప్రారంభ స్థాయి టెక్నాలజీ స్టార్టప్‌లో రూ.10-20 లక్షల వరకూ పెట్టుబడులు పెడుతోంది. టెక్నాలజీ ఇన్నోవేషన్ ఫండ్ పేరుతో ఇన్సెసెంట్ టెక్నాలజీస్ నిధిని ఏర్పాటు చేయడంతో పాటుగా మెంటరింగ్, మార్గదర్శన సేవలను కూడా అందిస్తోంది. ఇనేడా వెంచర్ గ్రూప్ వంటి వెంచర్ కేపిటల్ సంస్థలు కూడా హైదరాబాద్‌లో ఉన్నాయి.విద్యార్థులు, ఔత్సాహికుల ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ, హైదరాబాద్), బిట్స్ పిలానీ, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా), ద ఇండస్ ఎంటర్‌ప్రైజెస్ (టై), హైదరాబాద్ చాప్టర్ వంటివి పనిచేస్తున్నాయి. ఇక్కడి స్టార్టప్‌లను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చేందుకు, వారి ఆలోచనలను, ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఆగస్ట్ ఫెస్ట్, ఇన్నోఫెస్ట్ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top