‘బై వన్‌, గెట్‌ వన్‌’ ఆఫర్లపై గుడ్‌న్యూస్‌

Freebies May Be Freed Of GST Payment Burden - Sakshi

న్యూఢిల్లీ : ఒక‌టి కొంటే ఒక‌టి ఉచితం.. ఒక‌టి కొంటే రెండు ఉచితం... మా ద‌గ్గ‌ర వ‌స్తువులు కొంటే 50 శాతం డిస్కౌంట్ ఇస్తాం... మా ద‌గ్గ‌ర షాపింగ్ చేస్తే 80 శాతం రాయితీ ఇస్తాం... ఇవన్నీ మాల్స్‌, దుకాణ‌దారుల ఆఫ‌ర్లు. ఎఫ్‌ఎంసీజీ నుంచి ఫార్మాస్యూటికల్‌, టెక్ట్స్‌టైల్‌, ఫుడ్‌, రిటైల్‌ చైన్‌ కంపెనీల వరకు అన్ని కంపెనీలు ఈ మార్కెటింగ్‌ టెక్నిక్‌నే ఎక్కువగా ఉపయోగించేవి. అయితే ఈ ఉచితాలన్నింటికీ గతేడాది అమల్లోకి వచ్చిన జీఎస్టీ మంగళం పాడేసింది. వాటిని కూడా పన్ను పరిధిలోకి తెచ్చింది. దీంతో కంపెనీలన్నీ ఈ ఉచితాలను పక్కనపెట్టేశాయి. ప్రస్తుతం ఈ ఉచితాలపై గుడ్‌న్యూస్‌ చెప్పబోతుంది జీఎస్టీ కౌన్సిల్‌. 

బై-వన్‌-గెట్‌-వన్‌-ఫ్రీ వంటి కంపెనీల ఉచిత ఆఫర్లను పన్ను పరిధి నుంచి మినహాయించాలని చూస్తోంది. జీఎస్టీ కౌన్సిల్‌ నేతృత్వంలోని ఓ ప్యానల్‌ అధికారులు.. ఉచితాలపై జీఎస్టీని తీసివేసే ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేశారని తెలిసింది. ఈ విషయంపై జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ కూడా జరుపబోతుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. అంతేకాక ఉచితంగా ఉత్పత్తిని అమ్ముతున్నట్టు కంపెనీలు వర్గీకరిస్తే ఇన్ని రోజులు వ్యాపారస్తులు ఇన్‌పుట్‌ క్రెడిట్‌ను కూడా కోల్పోయేవారు. అయితే ఇక నుంచి గిఫ్ట్‌లు, శాంపుల్స్‌పై ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను నిరాకరించకూడదని కూడా కమిటీ నిర్ణయించింది. ప్రమోషనల్‌ స్కీమ్స్‌లో బై-వన్‌-గెట్‌-వన్‌-ఫ్రీ అనేది చాలా పాపులర్‌. కానీ జీఎస్టీ అమల్లోకి వచ్చాక, చాలా కంపెనీలు దీన్ని తీసేశాయి. కొంతమంది దీన్ని అవలంభించినా.. పన్ను డిపార్ట్‌మెంట్‌ నుంచి వారికి నోటీసులు వెళ్లాయి. వ్యాపారం కోసం ఉచిత ధరలకు ఏదైనా అందించినా.. లేదా శాంపుల్స్‌ సరఫరా చేసినా.. ఇన్‌పుట్‌ క్రెడిట్‌పై ఎలాంటి పరిమితులు విధించకూడదని పీడబ్ల్యూసీ పరోక్ష పన్ను అధికారి ప్రతీక్‌ జైన్‌ చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top