నాలుగో రోజూ మార్కెట్‌ అప్‌ | Fourth daily market up | Sakshi
Sakshi News home page

నాలుగో రోజూ మార్కెట్‌ అప్‌

Aug 29 2017 1:29 AM | Updated on Sep 17 2017 6:03 PM

నాలుగో రోజూ మార్కెట్‌ అప్‌

నాలుగో రోజూ మార్కెట్‌ అప్‌

దౌత్యపరమైన ఒప్పందం ద్వారా భారత్‌–చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు సడలటంతో సోమవారం స్టాక్‌ మార్కెట్లో రిలీఫ్‌ ర్యాలీ జరిగింది.

భారత్‌ – చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు సడలిన ప్రభావం
ముంబై: దౌత్యపరమైన ఒప్పందం ద్వారా భారత్‌–చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు సడలటంతో సోమవారం స్టాక్‌ మార్కెట్లో రిలీఫ్‌ ర్యాలీ జరిగింది. ప్రపంచ మార్కెట్లు సైతం సానుకూలంగా ట్రేడ్‌కావడం సెంటిమెంట్‌ను బలపర్చింది. దాంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 155 పాయింట్లు జంప్‌చేసి 31,751 పాయింట్ల వద్ద ముగిసింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 56 పాయింట్ల పెరుగుదలతో 9,913 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సూచీలు లాభాలతో ముగియడం వరుసగా ఇది నాల్గవ రోజు. మరో వారంరోజుల్లో చైనాలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోది హాజరుకానున్న నేపథ్యంలో డొకలాం వద్ద సైనిక బలగాల మోహరింపును వెనక్కు తీసుకోవాలన్న ఒప్పందానికి ఇరుదేశాలు వచ్చిన కారణంగా దేశీయ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. రూపాయి బలపడటం కూడా కలిసివచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.  

ఇన్ఫీ జోరు...
సూచీల పరుగుకు హెవీవెయిట్‌ షేరు ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ ర్యాలీ జరపడం ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆధార్‌ ఆర్కిటెక్ట్‌ నందన్‌ నీలకేని ఇన్ఫోసిస్‌ కొత్త ఛైర్మన్‌గా నియమితులుకావడాన్ని మార్కెట్‌ స్వాగతించిందని, దాంతో ఇన్ఫోసిస్‌ 3 శాతంపైగా ర్యాలీ జరిపి రూ. 941 వద్ద ముగిసినట్లు వారు వివరించారు. ఇటీవలి కనిష్టస్థాయి రూ. 860 నుంచి 9 శాతం మేర ఇన్ఫీ ర్యాలీ జరపడం విశేషం.

 నీలకేని రాకతో ఇన్ఫోసిస్‌ యాజమాన్యానికి స్థిరత్వం ఏర్పడుతుందన్న భావన ఇన్వెస్టర్లలో కలగడంతో ఇన్ఫోసిస్‌ షేరు రిలీఫ్‌ ర్యాలీ జరిపిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, హీరో మోటో కార్ప్, హెచ్‌యూఎల్‌లు 1–2 శాతం మధ్య ఎగిసాయి. డాక్టర్‌ రెడ్డీస్‌లాబ్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్‌ షేర్లు 1 శాతంపైగా క్షీణించాయి.   

నిఫ్టీ 50–లోకి బజాజ్‌ ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్, యూపీఎల్‌
ఏసీసీ, బీఓబీ, టాటా పవర్‌ తొలగింపు
నిఫ్టీ–50 ఇండెక్స్‌లో కొత్తగా బజాజ్‌ ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్, యునైటెడ్‌ పాస్ఫరస్‌ లిమిటెడ్‌ (యూపీఎల్‌)లు ప్రవేశించనున్నాయి. ఈ ఇండెక్స్‌లో ఇప్పటివరకూ భాగమైన ఏసీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), టాటా పవర్‌ షేర్లను నిఫ్టీ–50 నుంచి తొలగించనున్నారు. ఈ మార్పులు సెప్టెంబర్‌ 29నుంచి అమల్లోకి వస్తాయి. సమీక్షానంతరం ఈ మార్పుల్ని చేస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈకి చెందిన ఇండియా ఇండెక్స్‌ సర్వీసెస్‌ అండ్‌ ప్రాడక్ట్స్‌ సోమవారం ప్రకటించింది. ప్రధాన సూచీతో పాటు ఇతర సూచీల్లో కూడా ఐఐఎస్‌ఎల్‌ మార్పులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement