మలి వయసులో మారాజులా.. | For the happy life of after retired | Sakshi
Sakshi News home page

మలి వయసులో మారాజులా..

May 4 2014 1:38 AM | Updated on Sep 2 2017 6:53 AM

మలి వయసులో మారాజులా..

మలి వయసులో మారాజులా..

ఉద్యోగం నుంచి రిటైరయ్యాక ఒడిదుడుకుల్లేని జీవితం కోసం తప్పనిసరిగా పొదుపు చేయాలి, పెట్టుబడులు పెట్టాలి.

ఉద్యోగం నుంచి రిటైరయ్యాక ఒడిదుడుకుల్లేని జీవితం కోసం తప్పనిసరిగా పొదుపు చేయాలి, పెట్టుబడులు పెట్టాలి. ప్రస్తుత ఆదాయమెంత, అందులో ఎంత మొత్తాన్ని పొదుపు చేయగలరు, ఏ వయసులో రిటైర్ కావాలనుకుంటున్నారు, అప్పటికి మీకు ఎంత మొత్తం అవసరం అవుతుంది... తదితర అంశాలన్నిటినీ రిటైర్మెంట్ అనంతర ప్రణాళిక కోసం పరిగణనలోకి తీసుకోవాలి. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చుల అంచనాలను కూడా రూపొందించుకోవాలి. అప్పటికి ఎంత సొమ్ము అవసరమో మదింపు చేస్తే ఇప్పుడు ప్రతి నెలా లేదా ఏటా ఎంత పెట్టుబడి పెట్టాలో సుమారుగా తెలుసుకోవచ్చు. మాసిక లేదా వార్షిక పెట్టుబడి లెక్క పూర్తయిన తర్వాత, రిస్క్ ప్రొఫైల్, ఆదాయ అంచనాల ఆధారంగా వివిధ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లలో మీకు తగినదాన్ని ఎంచుకోవచ్చు.

 ప్రాచీన పెట్టుబడి సిద్ధాంతం ఏమిటంటే... ఓ వ్యక్తి యౌవనంలో ఉన్నపుడు రిస్కు ఉండే ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేయాలి. వయసు పైబడిన వారైతే సురక్షిత ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలి. రిటైర్మెంటుకు దగ్గరపడిన వారు రిస్కులకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే పొదుపు చేయడం ప్రారంభిస్తే... రిటైర్మెంటుకు దాదాపు 30 ఏళ్ల వ్యవధి ఉంటుంది కాబట్టి అప్పటికి భారీమొత్తం చేతికి అందుతుంది. ప్రతి వ్యక్తీ తన నికర ఆదాయంలో 20 శాతాన్ని పెట్టుబడులకు కేటాయించాలి. ఇందులో సగాన్ని రిటైర్మెంట్ తర్వాతి అవసరాలకు ఇన్వెస్ట్ చేయాలి.

 ఖర్చులు తగ్గించాలి...
 పెట్టుబడులు చేయడానికి ముందు మీ ఆదాయాన్నీ, ఖర్చులనూ 2 నెలలపాటు నిశితంగా పరిశీలించండి. ఏయే ఖర్చులను తగ్గించుకోవచ్చో గమనించండి. ఇప్పటి అవసరాల కంటే రిటైర్మెంట్ తర్వాత అవసరాలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. ఆసుపత్రి ఖర్చులు, తదితరాలు రిటైర్మెంట్ తర్వాత పెరుగుతాయి కదా. పదవీ విరమణ తర్వాత ఇల్లు కొనుక్కోవడం, దేశ విదేశీ పర్యటనలు వంటి ఆలోచనలుంటే మీ ప్లానింగ్ కూడా అందుకు తగినట్లుగా ఉండాలి.

 ముఖ్యమైన అంశాలు...
 సాధ్యమైనంత త్వరగా పొదుపు, పెట్టుబడులు ప్రారంభించాలి.

 అనవసర వ్యయాలకు కళ్లెం వేయాలి.

 రిటైర్మెంట్ తర్వాత ఎంత సొమ్ము అవసరమవుతుందో అంచనా వేయాలి. భవిష్యత్తులో ఊహించని కొన్ని ఖర్చులుంటాయి కాబట్టి వాటికీ కొంతమొత్తాన్ని కేటాయించాలి.

రిటైర్మెంట్ ఫండ్ కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు మంచివేకానీ, వేటిల్లో పెట్టుబడులు చేశామన్నది నిరంతరం సమీక్షిస్తూ ఉండాలి, అవసరమైనపుడు మార్పులు చేయాలి.
 
 ఓ వ్యక్తి రిటైర్మెంట్ ప్లాన్‌ను ఇపుడు పరిశీలిద్దాం..
 ప్రస్తుత వయసు                        30 ఏళ్లు
 రిటైర్మెంట్ వయసు                        55 ఏళ్లు
 ప్రస్తుత నెలవారీ ఖర్చులు          రూ.30 వేలు
 రిటైరైన తర్వాత నెలవారీ ఖర్చులు    రూ.1,28,756
 ద్రవ్యోల్బణ రేటు                            6 శాతం
 రిటైర్మెంట్ తర్వాత కావలసిన సొమ్ము    రూ.3,70,93,740

 (నోట్: ఈ వ్యక్తికి 90 ఏళ్లు వచ్చే వరకు అవసరమైన సొమ్ము ఇది. రిటైర్మెంట్ తర్వాత రీ-ఇన్వెస్ట్‌మెంట్ రేటును 8 శాతంగా లెక్కించాం)

 నెలవారీ చేయాల్సిన పెట్టుబడులు
 రాబడి            నెలవారీ పెట్టుబడులు
 8 శాతం                రూ.39,004
 10 శాతం              రూ.27,957
 12 శాతం                రూ.19,743

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement