
ఫ్లిప్‌కార్ట్‌లో 12,000 మందికి ఉద్యోగాలు!
ఆన్‌లైన్ మార్కెటింగ్(ఈకామర్స్) సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది 12,000 మందికి కొత్తగా ఉపాధి కల్పించనుంది. దేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కార్యకలాపాలకు మద్దతుగా సిబ్బందిని పెంచుకోవాలని భావిస్తోంది.
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మార్కెటింగ్(ఈకామర్స్) సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది 12,000 మందికి కొత్తగా ఉపాధి కల్పించనుంది. దేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కార్యకలాపాలకు మద్దతుగా సిబ్బందిని పెంచుకోవాలని భావిస్తోంది. ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న ఇండియాలో పెరుగుతున్న బిజినెస్‌కు అనుగుణంగా సాంకేతిక పటిష్టతను మెరుగుపరచుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 13,000 మంది సిబ్బందిని 25,000కు పెంచుకోనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్(సీపీవో) మేకిన్ మహేశ్వరి చెప్పారు.
తమ అవసరాలకు అనుగుణంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఒక్క ఇంజనీరింగ్‌లోనే 1,200 మందిని నియమించుకోనున్నట్లు తెలిపారు. ఈ బాటలో అమ్మకందారుల సంఖ్యను కూడా 12,000కు పెంచుకోవడం ద్వారా 30 పట్టణాలకు విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించారు. కంపెనీ గత నెలలో దుస్తుల విక్రయ ఆన్‌లైన్ సంస్థ మింత్రాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 2,000 కోట్లను వెచ్చించింది.