త్వరలో తొలి ఆర్‌ఈఐటీ

First Real Estate Investment Trust in the country - Sakshi

బ్లాక్‌స్టోన్, ఎంబసీ గ్రూపు ఆధ్వర్యంలో రాక 

రూ.5,000 కోట్ల సమీకరణ 

న్యూఢిల్లీ: దేశంలో తొలి రియల్‌ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్‌ఈఐటీ/రీట్‌) కార్యరూపం దాల్చనుంది. అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ బ్లాక్‌ స్టోన్, రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూపు సంయుక్తంగా వచ్చే కొన్ని వారాల్లో రీట్‌ ద్వారా రూ.5,000 కోట్లను సమీకరించనున్నాయి. బ్లాక్‌స్టోన్, ఎంబసీ గ్రూపు జాయింట్‌ వెంచర్‌ అయిన ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ గతేడాది సెప్టెంబర్‌లోనే సెబీ వద్ద రీట్‌ ఇష్యూకు సంబంధించి పత్రాలను దాఖలు చేసింది. 33 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన పోర్ట్‌ఫోలియో ఈ జాయింట్‌ వెంచర్‌కు ఉంది. ఆసియాలో అతిపెద్దది. అద్దెల రూపంలో ఆదాయాన్నిచ్చే రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను రీట్‌ కలిగి ఉంటుంది. ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా పరోక్షంగా రియల్‌ ఎస్టేట్‌ నుంచి ఆదాయాన్ని అందుకోవచ్చు. సెబీ తొలిసారిగా 2014లో రీట్‌ నిబంధనలను విడుదల చేసిన విషయం గమనార్హం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్‌విట్‌)లను కూడా సెబీ అనుమతించగా, ఇప్పటికే ఐఆర్‌బీ ఇన్‌విట్‌ ఫండ్, ఇండ్‌ ఇన్‌ఫ్రావిట్‌ ట్రస్ట్‌లు ప్రజల నుంచి నిధులను సమీకరించి స్టాక్‌ ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్‌ అయి ఉన్నాయి.
 
మంచి లాభసాటే! 
కొన్ని వారాల్లో తమ రీట్‌ను విడుదల చేయనున్నట్టు ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ సీఈవో మైక్‌ హోలండ్‌ ధ్రువీకరించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్‌లో మాదిరిగా, భారత్‌లోనూ రీట్‌ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రీట్‌లో రాబడులు మొదటి ఏడాదిలో 9 శాతం, ఐదేళ్ల కాలంలో 18 శాతం వరకు ఉంటాయని అంచనా.  బెంగళూరు, పుణె, నోయిడా, ముంబైలోని ఏడు ఆఫీసు కార్యాలయ పార్క్‌లు, భవనాలను ప్రతిపాదిత రీట్‌లో చేర్చనుంది. మొత్తం 33 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణం దీని పరిధిలో ఉంటుంది. 24 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం పరిధిలో ఇప్పటికే రూ.2,000 కోట్ల ఆదాయం వార్షికంగా వస్తోంది. 3 మిలియన్‌ చదరపు అడుగుల పరిధిలో నిర్మాణం జరుగుతుండగా, మరో 6 మిలియన్ల చదరపు అడుగుల మేర నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. 50 శాతానికి పైగా అద్దె ఆదాయం ఫార్చ్యూన్‌ 500 కంపెనీల నుంచే వస్తోంది. రానున్న మూడేళ్లలో అద్దెల ఆదాయం 55 శాతం వరకు పెరుగుతుందని అంచనా. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top