చిన్నారులకు రూపాయి విద్య

financial fundamentals to childrens - Sakshi

మూడేళ్ల నుంచే  వారిలో ఆసక్తి

చిన్న విషయాలతో మొదలు పెట్టాలి

ప్రతీ ఆర్థిక విషయం వివరంగా తెలియజేయాలి

వయసుకు తగ్గ పాఠాలు

మేజర్‌ అయ్యే నాటికి సమగ్ర అవగాహన

డబ్బు విషయంలో వారి ఆలోచనే మారిపోతుంది

తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని అనుకోవడం సహజం. ఈ దిశగా తమకు తెలిసిన వివిధ నైపుణ్యాలను వారు సందర్భానుసారం తమ చిన్నారులకు తెలియజేస్తూనే ఉంటారు. వీటిలో అత్యంత ముఖ్యమైంది నగదు వినియోగం గురించి. తమ అవసరాలను తాము తీర్చుకోగలిగే విధంగా వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిపై ఉంటుంది. గతంలో పోలిస్తే నేడు కరెన్సీ వినియోగం బాగా తగ్గింది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ చెల్లింపుల దిశగా ప్రోత్సహించడం, టెక్నాలజీ ఇలా ఎన్నో అంశాలు ఇందుకు కారణాలు చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో డబ్బులు ఎలా, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వినియోగం అవుతున్నాయి తదితర విషయాలు పిల్లలకు ఎలా తెలుస్తాయి? అది తల్లిదండ్రులే నేర్పించాలి. అందుకే అది ముందే మొదలు పెట్టడం మంచిది.  

పిల్లలకు ఎన్నో చెప్పాలని అనుకుంటూంటారు. కానీ వాయిదా వేయడం చాలా మంది చేస్తుంటారు. ఈ అలవాటును పక్కన పెట్టేసి ముందు పిల్లలకు డబ్బులు లెక్క పెట్టడం నేర్పించాలి. ఒకే విలువ కలిగిన కాయిన్లన్నీ ఒక దగ్గర పేర్చమని చెప్పడం, వాటి విలువ ఎలా లెక్కించాలన్నది తెలియజేయడం వంటి చిన్న చిన్న పనులతో నేర్పడం ప్రారంభించాలి. అంతేకానీ, క్రెడిట్‌ కార్డు, క్రెడిట్‌ స్కోరుతో మొదలు పెడితే ఏమంత ప్రయోజనం ఉండదు. కష్టమైన విధానంలో కాకుండా వారు ఆసక్తితో తెలుసుకునే సులభమైన విధానంలో నేర్పించాలి.  

పొదుపు మంత్రం
చిన్నారులకు ముందుగానే పొదుపు నేర్పాలనుకుంటే వారికి ఓ పిగ్గీ బ్యాంకు కొనివ్వాలి. వివిధ సందర్భాల్లో వారు చేసే మంచి పనులకు ప్రోత్సాహకంగా కొంత నగదు ఇస్తూ దాన్ని పిగ్గీ బ్యాంకులో వేసుకునేలా ప్రోత్సహించాలి. ఆటబొమ్మలు, పుస్తకాలను పద్ధతిగా షెల్ఫ్‌లో ఉంచినప్పుడు, చెప్పిన పని చేసినప్పుడు తదితర సందర్భాలను ప్రోత్సాహకాలకు అనువుగా ఉపయోగించుకోవాలి. వారు మరింత అర్థం చేసుకునే వయసుకు వచ్చిన తర్వాత సుమారు 8 ఏళ్ల వయసులో వారి పేరిట బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతా తెరవడం మంచి చర్య అవుతుంది.

ఖాతా తమ పేరుతో ఉంటే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పొదుపు, బాధ్యత తెలిసొస్తుంది. బ్యాంకింగ్‌ వ్యవహారాల గురించి కూడా అవగాహన ఏర్పడుతుంది.  బంధువులు, పిన్ని, బాబాయి, బామ్మ, అమ్మమ్మ, తాతయ్యలు ప్రేమతో ఇచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని తెలియజేయాలి. దాన్ని పొదుపు చేసుకునేలా ప్రోత్సహించాలి. వినని సందర్భాల్లో కనీసం అందులో కొంత భాగం ఖర్చు చేయగా మిగిలిన మేరకైనా పొదుపు చేసే విధంగా వారికి మీ చర్యలతో ఆకర్షణీయంగా తెలియజేయాలి.

ఏటీఎంకు వెళుతుంటే వారిని వెంట తీసుకెళ్లడం, లావాదేవీలు చేసే సమయంలో వాటి గురించి తెలియజేయడం, షాపింగ్‌కు వెళుతున్నప్పుడు వారిని కూడా తీసుకెళ్లి డబ్బులు చెల్లిస్తేనే అవి వస్తాయంటూ డబ్బు విలువ గురించి చెప్పాలి. అయితే, ఏటీఎంలో కార్డు పెట్టేసి పిన్‌ ఇచ్చేస్తే డబ్బుల నోట్లు వస్తాయని కాకుండా, అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి మీ వరకు వచ్చాయో వివరించాలి. కష్టపడి ప్రతి రోజు ఉద్యోగం చేయడం ద్వారా వచ్చాయని చెప్పాలి. దీంతో డబ్బులున్నవి మెషిన్ల నుంచి వచ్చేవి కావని, మంచిగా చదివి గొప్ప స్థాయికి చేరుకుంటే వచ్చేవన్న అవగాహన వారిలో కలుగుతుంది. దీంతో డబ్బు విలువ, పొదుపు విలువ కూడా తెలిసివస్తుంది.  

నేటితరం పిల్లలు ఆర్థిక అంశాలపైనా ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు. టీవీలో హోమ్‌లోన్‌ ప్రకటన వచ్చిందనుకోండి... వారి నుంచి ఏ ప్రశ్న ఎదురైనా వివరంగా చెప్పాలి. మొక్కుబడిగా, అరకొరగా చెప్పి ఊరుకోవద్దు. మీరు చెప్పిన దానికి వారు పూర్తిగా సంతుష్టులవ్వాలి. గృహ రుణానికి ఎవరు అర్హులు, ఇచ్చేది ఎవరు, వడ్డీ రేటు, రుణ కాల వ్యవధి, చెల్లించలేకపోతే ఏం జరుగుతుంది ఇత్యాది విషయాలు తెలియజేయాలి. మీ వేతన చెల్లింపుల పత్రాన్ని చూపించడం కూడా మంచి ఐడియానే. వేతనం ఎంతొస్తుంది, దేనికి ఎంత ఖర్చవుతుంది, ఎంత పొదుపు చేస్తున్నారు తదితర విషయాలను పే స్లిప్‌ చూపించి వారికి తెలియజేయవచ్చు. రుణం ఏదైనా తీసుకుని ఉంటే దానికి ఎంత చెల్లించాలి కూడా చెప్పండి.  

 కార్డు వాడకం గురించి...
సూపర్‌ మార్కెట్‌ నుంచి ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వరకు చాలా మంది క్రెడిట్‌ కార్డును వాడేస్తున్నారు. ఇది చూసి మీ పిల్లలు కార్డు ద్వారా కొనుగోలు చేయడం చాలా సులభమని పొరపడే అవకాశం ఉండొచ్చు. అందుకే వారికి క్రెడిట్‌ కార్డు గురించి వివరంగా చెప్పాలి. ఉదాహరణలతో చెప్పడం వల్ల వారి సందేహాలన్నింటిని తొలగించొచ్చు.  

క్రెడిట్‌ కార్డుపై కొనుగోలు
చిన్నారులు ఏదేనీ గ్యాడ్జెట్‌ కావాలని ఒత్తిడి తీసుకొస్తే వారికి క్రెడిట్‌ కార్డు ద్వారా కొనిపించండి. అది కూడా బిల్లింగ్‌ సైకిల్‌ లోపట ఆ మొత్తాన్ని దాచుకున్న నిధి నుంచి తిరిగి చెల్లించాలనే షరతుపై ఇప్పించండి. దీనివల్ల వారికి ధన వినియోగం గురించి తెలిసొస్తుంది. క్రెడిట్‌ కార్డు ద్వారా వినియోగించుకున్న డబ్బులను సకాలంలో చెల్లించకపోతే ఏమవుతుంది, క్రెడిట్‌ స్కోరు తగ్గడం, దాని పర్యవసనాల గురించి కూడా తెలియజేయాలి. కష్టపడి పనిచేయడం ద్వారానే డబ్బులు వస్తాయని ఈ విషయాల ద్వారా వారికి తెలిసొస్తుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత మీరు చెప్పిన విషయాలు వారికి ఎంతో ఉపయోగకరంగా అనిపిస్తాయి.   

వయసు పెరుగుతున్న కొద్దీ విషయాలు
ఆర్థిక విషయాలైన పొదుపు, ఖర్చుల గురించి చెబితే చిన్నారులు మూడేళ్ల వయసులోనే వాటిని గ్రహించే శక్తి కలిగి ఉంటారని పరిశోధకులు పేర్కొంటున్నారు. వీరికి ఏడవ ఏట నుంచి సాధారణంగా డబ్బు అలవాటు మొదలవుతుందంటున్నారు. అందుకే 3–6 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారికి డబ్బులు లెక్కించడం, పొదుపు, ఖర్చు, ఇతరులకు ఇవ్వడం వంటి విషయాలు తెలియజేయాలి. 8–9 ఏళ్ల వయసు వారికి బహమతులు, ప్రోత్సాహకంగా కొంత డబ్బు ఇవ్వొచ్చు. వారి పేరిట సేవింగ్స్‌ ఖాతా తెరిచే సమయం ఇది.

సూపర్‌ మార్కెట్‌లో కొనుగోళ్లు, ఇతర ఆర్థిక లావాదేవీల సమయంలో వారిని వెంట తీసుకెళ్లి కొత్త విషయాలు తెలియజేయాలి. సరుకుల కొనుగోలు సమయంలో వాటి ధరలు, తగ్గింపులు, ఆఫర్ల గురించి కూడా చెప్పాలి. 10–12 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత బ్యాంకు ఖాతాలు, పొదుపుపై వడ్డీ రేటు, కాంపౌండింగ్‌ వడ్డీ రేటు, రుణం, క్రెడిట్‌ కార్డు, ఆర్థిక లక్ష్యాలు, బడ్జెట్, కెరీర్‌ గురించి వివరించాలి. 13–17 ఏళ్ల వయసు వారికి స్టాక్‌ మార్కెట్‌ బేసిక్స్, మ్యూచువల్‌ ఫండ్స్, ఇతర పెట్టుబడి అవకాశాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు, రుణ నిర్వహణ, ఇన్సూరెన్స్, ఆన్‌లైన్‌ మోసాలు, ఇతర విషయాలు గురించి తెలియజేయాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top